: ఆశ్చర్యంగా ఉంది.. శాసనసభలో మాకు కనీస సమయం కూడా ఇవ్వట్లేదు: జగన్ విమర్శలు

వాయిదా అనంత‌రం తిరిగి ప్రారంభ‌మైన శాస‌న‌స‌భ‌లో ప్ర‌స్తుతం గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ప్ర‌సంగంపై ధన్యవాద తీర్మానంపై చ‌ర్చ కొనసాగుతోంది. అయితే, ఈ తీర్మానం ప్రవేశపెట్టడానికి ముందు మాట్లాడిన ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి.. తాము మాట్లాడ‌డానికి అడిగినంత స‌మ‌యం ఇవ్వ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యంగా ఉందని అన్నారు. ప్ర‌తిప‌క్షం మాట్లాడ‌కూడ‌దు అనేలా స‌మ‌యాన్ని త‌గ్గిస్తున్నారని ఆయ‌న ఆరోపించారు. తాము గంటన్నర సేపు మాట్లాడేందుకు విన్న‌వించుకున్నామ‌ని అయిన‌ప్ప‌టికీ త‌మ‌కు అడిగినంత స‌మ‌యం ఇవ్వ‌డం లేద‌ని అన్నారు. మ‌రోవైపు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి ఎంతంటే అంత స‌మ‌యం ఇస్తున్నారని ఆయ‌న అన్నారు. త‌మ‌కు మాత్రం ఇవ్వ‌ట్లేదని అన్నారు.

దీనికి మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు స‌మాధానం చెబుతూ.. ఉన్న స‌మ‌యాన్ని విభ‌జించి ఇస్తారని, ఆ స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షానికి ఎంత స‌మ‌యం వ‌స్తుందో అంతే మాట్లాడాల్సి ఉంటుందని చెప్పారు. తాము నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే న‌డుచుకుంటున్నామ‌ని చెప్పారు. దీనికి జ‌గ‌న్ మండిప‌డుతూ ‘మంత్రిగారు రూల్స్ గురించి చ‌క్క‌గా మాట్లాడారు.. అయితే చంద్ర‌బాబు నాయుడికి కూడా అదే నిబంధ‌న వ‌ర్తించాలి’ అని అన్నారు. దీనికి య‌న‌మల స‌మాధానం చెబుతూ.. చ‌ర్చ వేరు, ప్ర‌భుత్వ స‌మాధానం ఇచ్చే అంశం వేర‌ని అన్నారు. చ‌ర్చ‌కు, ప్ర‌భుత్వ సభ్యులు స‌మాధానం చెప్పుకునేందుకు స‌మ‌యం కేటాయింపు వేరుగా ఉంటుందని అన్నారు. డిబేట్ కి టైమ్ కేటాయింపు ఉంటుంది కానీ, స‌మాధానం చెప్ప‌డానికి  ఉండ‌దని స్ప‌ష్టం చేశారు.

More Telugu News