: ఇది నా మహద్భాగ్యం: గవర్నర్ నరసింహన్

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో అనతి కాలంలోనే అద్భుత రీతిలో నిర్మించిన అసెంబ్లీ భవనంలో జరుగుతున్న తొలి సమావేశాల్లో తాను కూడా భాగం కావడం, తనకు జీవితంలో లభించిన మహద్భాగ్యమని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా, ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తొలుత తెలుగులో ప్రారంభించిన తన ప్రసంగంలో అందరికీ అభినందనలు తెలిపిన గవర్నర్, ఆపై ఇంగ్లీషులో తన ప్రసంగాన్ని కొనసాగించారు.

రికార్డు సమయంలో అత్యంత ఆధునిక సాంకేతికత, పూర్తి ఎల్ఈడీ వెలుగులతో అసెంబ్లీ భవనాన్ని నిర్మించిన ప్రతి కార్మికుడికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన రెండేళ్లలోనే రెండంకెల వృద్ధిని చేరుకున్నామని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేంద్రంగా చేయడంలో తన ప్రభుత్వం ఎంతో ముందడుగు వేసిందని, ఇప్పటికే లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు, నూతన ఉద్యోగాలు రాష్ట్రానికి వచ్చాయని, మరిన్ని కంపెనీలు రానున్నాయని అన్నారు. నదుల అనుసంధానంలో దేశంలోనే ముందు నిలిచిన రాష్ట్రంగా ఏపీ చరిత్ర సృష్టించిందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, ఈ ప్రాజెక్టు పూర్తయితే, లక్షలాది ఎకరాలు గోదావరి నీటితో సస్యశ్యామలమవుతాయని అన్నారు. తోటపల్లి, వెలుగొండ ప్రాజెక్టులు సైతం అనుకున్న సమయంలోగా పూర్తవుతాయని అన్నారు.

వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో 24 శాతం వృద్ధిని రాష్ట్రం నమోదు చేసిందని, పారిశ్రామిక రంగంలో 9 శాతానికి పైగా వృద్ధి నమోదైందని గవర్నర్ గుర్తు చేశారు. వర్షాలు తక్కువగా ఉన్నా ఈ రంగంలో మంచి వృద్ధిని సాధించామని చెప్పుకొచ్చారు. వ్యవసాయాన్ని మరింత లాభదాయకం చేసేందుకు రైతులకు రాయితీపై యంత్రాల సరఫరా జరుగుతోందని, సంక్షోభాలను రాష్ట్రం అవకాశాలుగా మలచుకోవడంలో విజయం సాధించిందని అన్నారు.  వనం - మనం, మిషన్ హరితాంధ్రప్రదేశ్ లలో భాగంగా, రాష్ట్రం కొత్త మొక్కలను నాటి, వాటిని సంరక్షించడంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది.

More Telugu News