: ఏపీ అసెంబ్లీలోకి ఎవరు ఎలా ప్రవేశించాలంటే..!

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో సిద్ధమైన అసెంబ్లీ భవనంలో తొలి సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలోకి ఎవరు, ఎలా ప్రవేశించాలన్న విషయమై స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆదేశాల మేరకు పోలీసులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇప్పటికే వెలగపూడికి వెళ్లే దారులన్నింటినీ పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, పలు చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అసెంబ్లీకి 5 గేట్లు, లోపలికి వెళ్లేందుకు 9 ప్రవేశ మార్గాలుండగా, వాటిని ప్రొటోకాల్ మేరకు విభజించారు.

గేట్ నంబర్ 1, ప్రవేశ ద్వారం నంబర్ 1ను సీఎం కోసం కేటాయించారు. స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ లు గేట్ 1 నుంచి లోనికి ప్రవేశించి, ప్రవేశద్వారం 6 గుండా లోపలికి వెళతారు. ఇక గేట్ 2 నుంచి లోపలికి వెళ్లే మంత్రులు, క్యాబినెట్ ర్యాంకు ఉన్నావారు, విపక్ష నేత, ప్రవేశద్వారం 8 గుండా అసెంబ్లీలోకి వెళ్లాల్సి వుంటుంది. 4వ నంబరు గేటును ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు కేటాయించారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి ప్రవేశమార్గం 8 గుండా, ఎమ్మెల్సీలు 3, 4 ద్వారాల గుండా వెళ్లాలని పోలీసులు తెలిపారు. గేట్ 3ని మీడియా వీఐపీ, ఇతర అధికారులకు కేటాయించామని, మీడియా ప్రవేశమార్గం 9 ద్వారా, వీఐపీలు, అధికారులు ప్రవేశమార్గం 7 గుండా లోపలికి వెళ్లాల్సి వుంటుందని తెలిపారు. గేట్ 5 ను శాసనసభ సిబ్బంది, ఐఏఎస్ లకు కేటాయించారు. వీరు ప్రవేశమార్గం 5 గుండా అసెంబ్లీ లోపలికి వెళ్లాలి.

More Telugu News