: హెచ్ 1-బీ వీసాలపై మరో బాంబేసిన ట్రంప్... వీసా ప్రీమియం ప్రాసెసింగ్ ఆరు నెలలు రద్దు

వీసా ప్రీమియమ్‌ ప్రాసెసింగ్‌ ను ఆరు నెలల పాటు రద్దు చేస్తున్నట్టు అమెరికా సర్కారు ప్రకటించింది. ఈ నిర్ణయం ఏప్రిల్‌ 3 నుంచి అమల్లోకి వస్తుందని, రెగ్యులర్‌ వీసా ప్రాసెసింగ్‌ లో జాప్యం తొలగించేందుకేనని ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల సాధారణ హెచ్‌ 1-బీ వీసాలకు ఇబ్బందిలేదని యూఎస్ సిటిజన్ షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ పేర్కొంది.

ఇక 2018 ఆర్థిక సంవత్సరానికిగాను, సాధారణ హెచ్ 1-బీ వీసాలకు దరఖాస్తులను కూడా ఏప్రిల్ 3 నుంచి తీసుకుంటామని తెలిపింది. ఇదే సమయంలో ఉద్యోగాల్లో స్థానికులకే పెద్దపీట వేస్తూ మరో బిల్లును బైపార్టిషన్ బృందం, యూఎస్ కాంగ్రెస్ లో ప్రవేశపెట్టింది. ఇది ఆమోదం పొందితే, అమెరికాలో ఉద్యోగం చేయాలని భావించే ఇండియన్స్ కు గడ్డుకాలమేనని నిపుణులు వ్యాఖ్యానించారు. కాగా, 1225 డాలర్ల ప్రత్యేక ఫీజుతో హెచ్-1బీ వీసాల ఆమోద ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేసుకునే వీలును కల్పించేదే ప్రీమియం ప్రాసెసింగ్. ప్రస్తుతం పెండింగులో ఉన్న వీసాల పరిశీలనా సమయాన్ని తగ్గించేందుకు ప్రీమియం వీసాల జారీ విధానాన్ని తాత్కాలికంగా ఆపినట్టు పేర్కొంది.

More Telugu News