: బ్రిటన్ జైళ్లలో 20,075 మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు... ఖైదీల నేర సామ్రాజ్యమా? మజాకానా?

బ్రిటన్‌ లోని జైలు ఖైదీలు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ఇంట్లో మాదిరి సోషల్ మీడియాలో సెల్ఫీలు, సెల్ఫ్ వీడియోలతో హల్ చల్ చేస్తున్నారు. దీంతో వారి వ్యవహారంపై పెను దుమారం రేగింది. రంగంలోకి దిగిన అధికారులు పలు జైళ్లలో తనిఖీలు నిర్వహించి, ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, జైళ్లలోని ఖైదీల నుంచి 20,075 స్మార్ట్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫోన్లన్నీ సామాజిక మాధ్యమాల కోసం వినియోగిస్తుండడం ఒక ఎత్తైతే, తమ నేరసామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు పలువురు ఖైదీలు ఆయుధంగా వాడుకుంటున్నారు. ఈ ఫోన్లతోనే హత్యలు, డ్రగ్స్‌ వ్యాపారం, కిడ్నాప్‌ లు వంటివి ప్లాన్ చేస్తున్నారని గుర్తించిన జైళ్ల శాఖాధికారులు ఆశ్చర్యపోయారు.

సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయాలపై స్పందించిన న్యాయశాఖ కార్యదర్శి లిజ్‌ ట్రస్‌ కొత్త నిబంధనలు జారీ చేశారు. ఇక నుంచి అన్ని జైళ్ళలోను మొబైల్‌ సిగ్నళ్ల జామర్లు పెట్టాలని ఆదేశించారు. ఈ క్రమంలో డేవిడ్‌ హాన్సన్‌ అనే లేబర్‌ పార్టీకి చెందిన మాజీ న్యాయశాఖ మంత్రి స్పందించారు. సెల్ ఫోన్లతో నేరచరిత్రను ఖైదీలు విస్తరించుకుంటున్నారని గతంలోనే హెచ్చరించానని, అయితే అప్పట్లో ప్రభుత్వం తన వ్యాఖ్యలు పట్టించుకోలేదని విమర్శించారు. కాగా, 2015లో బ్రిటన్ జైళ్లలో 16,987 మొబైల్‌ ఫోన్లు, యూఎస్‌బీలు, సిమ్‌ కార్డులు, మీడియా కార్డులు దొరకగా, 2016 లో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 20,075 మొబైల్‌ ఫోన్లు బయటపడ్డాయి. దీంతో అంతకుముందు ఏడాదితో పోల్చితే జైళ్లలో దొరికిన సెల్ ఫోన్లు 18శాతం పెరగడం విశేషం. 

More Telugu News