: పునాదుల కింద బయటపడ్డ ఆ బాంబును చూస్తే ఎవరైనా భయపడాల్సిందే!

రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబులు అప్పుడప్పుడు బయటపడుతూ సాధారణ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న ఘటనలు వివిధ యూరోపియన్ దేశాల్లో చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బ్రిటన్ లోని వాయవ్య లండన్‌ లోని బ్రెంట్‌ ప్రాంతంలో బ్రాండెస్బరి పార్క్‌ సమీపంలో ఓ ఇంటిని నిర్మించేందుకు పునాదులు తవ్వించిన కుటుంబంతో పాటు ఆ ప్రాంత ప్రజలు మొత్తం బెంబేలెత్తిపోయారు. దానికి కారణమేంటంటే, 500 పౌండ్ల బరువుండే బాంబు ఒకటి బయటపడింది. ఇంకా విస్ఫోటనం చెందని ఆ బాంబు గురించి పోలీసులు, సైన్యానికి సమాచారమిచ్చిన స్థానికులు ఆ ప్రాంతాన్ని స్వచ్చందంగా ఖాళీ చేశారు. దీనిపై స్థానిక పోలీసు అధికారి మాట్లాడుతూ, ఆ ప్రాంత వాసులకు ధన్యవాదాలు చెప్పారు.

బాంబును గుర్తించి వెంటనే తమకు సమాచారం ఇచ్చారని, స్వచ్ఛందంగా తమ ఇళ్లను వదిలివెళ్లి బాంబు నిర్వీర్య దళానికి సహాయం చేస్తున్నారని అన్నారు. 200 మీటర్ల దూరం ప్రత్యేక భద్రతను ఏర్పాటుచేసి ఎవరినీ ఆ చుట్టుపక్కలకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. రెండు స్కూళ్లను ఖాళీ చేయించామని చెప్పారు. ఎవరికీ ఎలాంటి హానీ జరగకుండా తీవ్రంగా శ్రమిస్తున్నామని తెలిపారు. అది కచ్చితంగా రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబే నని దానిని చూస్తేనే సామాన్యులకు గుండెల్లో భయం పుడుతోందని, ఎలాంటి విస్ఫోటనం జరగకుండా తగిన విధంగా నిర్వీర్యానికి ప్రయత్నిస్తున్నామని ఆయన వివరించారు. 

More Telugu News