: రాజస్థాన్ లో విచిత్ర పరిస్థితి... రేషన్ బియ్యం కోసం మహిళలు నిచ్చెనలు వేసుకుని చెట్టెక్కాల్సిన దుస్థితి!

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు 125 కిలోమీటర్ల దూరంలోని కోట్రా అనే వెనుకబడిన ప్రాంతమది. ఈ ప్రాంతంలో నెలకాగానే, రేషన్ బియ్యం తెచ్చుకోవాలంటే, నిచ్చెనలు వేసుకుని చెట్లెక్కాల్సిన పరిస్థితి. ఇది వాస్తవం. చెట్టుఎక్కే సత్తా ఉంటేనే ఇక్కడ రేషన్ లభిస్తుంది. రేషన్ కార్డు మహిళల పేరిట ఉండటంతో నెలకోసారి వారు తప్పనిసరిగా చెట్టు ఎక్కాల్సిందే.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే, పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లలో ఫింగర్ ప్రింట్, బయో మెట్రిక్ సరిపోతేనే రేషన్ అందుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రాంతంలో మొబైల్ సిగ్నల్స్ నేలపై ఉంటే ఎన్నటికీ లభించవు. అదే ఓ చెట్టు ఎక్కితే, కాసేపటికైనా సిగ్నల్స్ వస్తాయి. అందుకే పీఓఎస్ మిషన్ పట్టుకుని రేషన్ డీలర్ చెట్టెక్కి కూర్చుంటే, అదే చెట్టు ఎక్కి గంటల తరబడి వేచి చూస్తూ, సిగ్నల్ అందగానే ఫింగర్ ప్రింట్ ను నమోదు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఇక పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ను మరింత పారదర్శకం చేశామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలకు కోట్రా ప్రాంత మహిళల దుస్థితి ఇప్పటికీ పట్టలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రాంతంలో 76 రేషన్ దుకాణాలు ఉండగా, అందులో 13 దుకాణాల సమీపంలో నెట్ కనెక్టివిటీ అత్యంత చెత్తగా ఉన్నట్టు తెలుస్తోంది. మీర్ పూర్, చిబార్ వాడి, మల్వియా ఖకారియా, పీప్లా, బురిదెబర్, బీరన్, పాల్చా, ఉమరియా, సామోలి తదితర గ్రామాల్లోని ప్రజలు బయో మెట్రిక్ వెరిఫికేషన్ కోసం గంటల తరబడి చెట్లపై వేచి చూస్తూ, తమకు కావాల్సిన బియ్యం, పంచదార, కిరోసిన్ వంటివి పొందేందుకు నానా అగచాట్లూ పడుతున్నారు.

ఒక్కోసారి తాము నాలుగు నుంచి ఐదు గంటల పాటు ఇంటర్నెట్ నెట్ వర్క్ కోసం చెట్లపై వేచి చూడాల్సి వస్తోందని, ఒకసారి చెట్టు దిగితే, అవకాశం పోతుందన్న ఆందోళనతో, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడే కొమ్మలపై కూర్చుంటున్నామని భోలా గమేతి అనే మహిళ వాపోయింది.

More Telugu News