: ట్రంప్ ‘గోడ’కు పోటీపడుతున్న 225 సంస్థలు!

అమెరికా-మెక్సికో సరిహద్దులో గోడ కడతానంటూ ఎన్నికల ప్రచారంలో సంచలన ప్రకటన చేసిన ట్రంప్ ప్రస్తుతం ఆ పనిలో బిజీగా ఉన్నారు. ట్రంప్ ప్రకటనతో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. అయినా ట్రంప్ ఎన్నికల హామీకే నిలబడ్డారు. గోడ కట్టి తీరాల్సిందేనని నిర్ణయించారు. సరిహద్దు గోడ నిర్మాణానికి క్యాడెల్, డిఫెన్స్ కాంట్రాక్టర్ రేథియాన్ వంటి పేరుమోసిన సంస్థలు పోటీపడుతున్నాయి. వీటితో పాటు మరో 20 లాటిన్ అమెరికా కంపెనీలు కూడా ముందుకొచ్చాయి. ఇప్పటి వరకు 225 నిర్మాణ, ఇంజినీరింగ్ సంస్థలు గోడ కడతామంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి.

మెక్సికోతో రెండువేల మైళ్ల మేర సరిహద్దును అమెరికా పంచుకుంటోంది. అయితే సరిహద్దు మొత్తం గోడ నిర్మిస్తారా? లేదా అన్న విషయంలో ప్రస్తుతానికి స్పష్టత లేదు. గోడ నిర్మాణానికి 21 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అంచనా వేస్తోంది. ఇక తన పదవీ కాలం ముగిసే లోపు పూర్తిచేయాలనే పట్టుదలతో ట్రంప్ ఉన్నారు. గోడ నిర్మాణానికి ఆసక్తి చూపుతున్న సంస్థలు ఈనెల 10లోపు సంబంధిత పత్రాలను, 24లోపు ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. తాను అధ్యక్షుడినైతే మెక్సికో నుంచి వలసలు నిరోధించడంతోపాటు డ్రగ్స్ అక్రమ రవాణాను నివారించేందుకు సరిహద్దులో గోడ నిర్మిస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన  సంగతి తెలిసిందే.

More Telugu News