: చికిత్స కోసం సింగపూర్ వెళ్లకుండా జయను అడ్డుకున్నారు.. అన్నాడీఎంకే తిరుగుబాటు నేత

అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత మెరుగైన చికిత్స కోసం సింగపూర్ వెళ్లాలనుకున్నారని, కానీ ఆమెను కొందరు అడ్డుకున్నారని అన్నాడీఎంకే తిరుగుబాటు నేత పీహెచ్ పాండియన్ ఆరోపించారు. అంతేకాదు ఆమె కోసం వచ్చిన ఎయిర్ అంబులెన్స్‌ను కూడా తిప్పి పంపారన్నారు. జయ మరణం వెనక పెద్ద కుట్ర ఉందని, ఈ విషయంలో ప్రధాని మోదీ వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. కిందపడడం వల్లే జయ గాయపడ్డారని అపోలో ఇచ్చిన డిశ్చార్జ్ సమ్మరీలో ఉందని పేర్కొన్న పాండియన్.. ఆమె ప్రమాదవశాత్తు పడిపోయారా? లేక ఎవరైనా తోసేశారా? అన్న విషయం తేలాల్సి ఉందన్నారు.

జయ అనారోగ్యంతో ఉన్నప్పుడు డీఎస్పీ ఒకరు అంబులెన్స్ రప్పించినట్టు శశికళ వర్గం చెబుతోందని, ఆ డీఎస్పీ ఎవరని? ప్రశ్నించారు. ‘అమ్మ’ను ఆస్పత్రిలో చేర్చినప్పుడు ఎవరు సంతకం చేశారని ప్రశ్నించారు. జయకు చికిత్స చేసిన ఎయిమ్స్ వైద్యులు కూడా స్పందించకపోవడం దారుణమని, ఈ విషయంలో కేంద్రమే సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. డిసెంబరు 4నే జయ మృతి చెందినట్టు వార్తలు వచ్చినా 5వ తేదీ రాత్రి వరకు ఎందుకు డ్రామాలాడారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రధాని, రాష్ట్రపతి ఈ విషయంలో జోక్యం చేసుకుని ప్రజలకు నిజాలు వెల్లడించాలని పాండియన్ కోరారు. అయితే ఆయన ఆరోపణలను మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ కొట్టిపడేశారు. జయ మృతి విషయంలో ఇప్పటికే అపోలో, విదేశీ వైద్యులు వివరణ ఇచ్చినట్టు తెలిపారు.  

More Telugu News