: ఇత‌ర‌ పార్టీల నేత‌లు కూడా ఈ రోజు వ‌చ్చుంటే బాగుండేది.. బాధ‌ క‌లిగిస్తోంది: చ‌ంద్ర‌బాబు

అమ‌రావ‌తిలో నిర్మించిన నూతన అసెంబ్లీ భ‌వ‌నాన్ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్రారంభించిన విష‌యం తెలిసిందే. అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో చంద్ర‌బాబు మాట్లాడారు. ఇత‌ర‌ పార్టీల నేత‌లు కూడా ఈ రోజు వ‌చ్చుంటే బాగుండేదని, ఈ విష‌యం త‌న‌కు బాధ‌క‌లిగిస్తోంద‌ని అన్నారు. వారు కూడా వ‌చ్చుంటే, సంతోషించే వారమ‌ని అన్నారు. అసెంబ్లీని ప్రారంభించి మంచి ప‌నిచేస్తోంటే బాధ్య‌త క‌లిగి వ్య‌క్తులు రాక‌పోవ‌డ‌మేంట‌ని అన్నారు.

రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ప‌ది ఏళ్లు మ‌న‌కు హైద‌రాబాద్ ఇచ్చార‌ని చంద్ర‌బాబు అన్నారు. దాని ఉద్దేశం రాజ‌ధాని నిర్మాణానికి క‌నీసం ఆ స‌మ‌యం ప‌డుతుంద‌ని అలా చేశార‌ని చెప్పారు. అయితే రికార్డు స‌మ‌యంలో ఇక్క‌డ భ‌వ‌నాలు నిర్మించుకొని ఇక్క‌డి నుంచే పాలన మొద‌లు పెట్టామ‌ని చెప్పారు. తాను త‌న కోసం కాకుండా రాష్ట్రం కోసం చేశానన్న తృప్తి త‌న‌కు ఉంటుందని చ‌ంద్ర‌బాబు అన్నారు. రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయం అంత త్వ‌ర‌గా మ‌ర‌చిపోలేమ‌ని చెప్పారు. ఆనాడు హైద‌రాబాద్‌ను విజ్ఞాన ఆధారిత న‌గ‌రంగా త‌యారు చేశామ‌ని, ఐటీ కంపెనీల స్థాప‌న కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డామ‌ని అన్నారు. ఈనాడు అమ‌రావ‌తి కోసం కృషి చేద్దామ‌ని పిలుపునిచ్చారు.

మ‌న కోపాన్ని క‌సిగా మార్చుకుందామ‌ని, అభివృద్ధి సాధిద్దామ‌ని చంద్రబాబు పేర్కొన్నారు. విజ‌భ‌న‌ ప‌ట్ల ఇప్ప‌టికీ బాధ‌క‌లుగుతుందని అన్నారు. రాజ‌ధానినే కాకుండా రాయ‌ల‌సీమ‌ను కూడా ర‌త‌నాల సీమ‌గా మార్చుతామ‌ని అన్నారు. అభివృద్ధికి కొందరు అడ్డుపడుతున్నారని అన్నారు. ప్రజల సహకారంతో ఏపీని ముందుకు తీసుకెళతానని అన్నారు.

More Telugu News