: జేఏసీలో తారస్థాయికి విభేదాలు.. కోదండకు అంత సీన్ లేదంటూ బహిరంగ లేఖ

తెలంగాణ జేఏసీలో మొదలైన విభేదాలు తారస్థాయికి చేరాయి. చైర్మన్ కోదండరాం తీరుపై మండిపడుతున్న వర్గం ఇప్పుడు ఆయన తీరును విమర్శిస్తూ బహిరంగ లేఖ రాసింది. కోదండవి ఒంటెత్తు పోకడలంటూ తీవ్ర ఆరోపణలు చేసిన జేఏసీ కన్వీనర్ పిట్టల రవీందర్‌కి మరో ఇద్దరు నేతలు జత కలిశారు. కోదండరాంకు రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచన ఉంటే జేఏసీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలంటూ బహిరంగ లేఖ రాశారు. టీజేఏసీని రాజకీయ పార్టీగా మార్చే ఉద్దేశం లేదంటూనే పార్టీ గురించి ఆయన మాట్లాడడాన్ని సమర్థించబోమని అందులో పేర్కొన్నారు. టీజేఏసీ నుంచి తప్పుకున్నాక మాత్రమే అటువంటి మాటలు మాట్లాడాలని సూచించారు.

కోదండకు ప్రస్తుతం లభిస్తున్న గౌరవం అందిరి వల్ల వచ్చిందని, అది సమష్టి త్యాగాల ఫలితమని పేర్కొన్నారు. ఇది గుర్తించని ఆయన తనవల్లే జేఏసీకి గుర్తింపు లభించిందని చెప్పుకోవడం సరికాదని మండిపడ్డారు. అసలు తమకున్న త్యాగాల చరిత్ర కోదండరాంకు లేదని కుండబద్దలు కొట్టారు. ఉద్యోగం చేసుకుంటూ ప్రమోషన్లు అందుకుని ఇప్పుడు పెన్షన్ కూడా తీసుకుంటున్న ఆయన రాష్ట్రం కోసం చేసిన ఒక్క త్యాగం గురించి అయినా చెప్పాలని లేఖలో డిమాండ్ చేశారు. దళిత, బహుజనులు బానిసలనే ఉద్దేశంతో కోదండరాం ఉన్నారని ఆరోపించారు. కాగా, సంచలనం సృష్టిస్తున్న ఈ లేఖను అంతర్గతంగా మాత్రమే రాశామని, ఇది బయటకెలా వచ్చిందో తెలియదని జేఏసీ నేత ప్రహ్లాద్ చెప్పడం గమనార్హం.


More Telugu News