: 'మా నాన్నను పాక్ చంపలేదు... యుద్ధం చంపింది' పోస్టుపై అద్భుతంగా స్పందించిన పాక్‌ సోదరుడు!

'మా నాన్నను పాక్ చంపలేదు... యుద్ధం చంపింది' అంటూ వీర‌జ‌వాను కూతురు గుర్ మెహర్ కౌర్ సోష‌ల్ మీడియాలో ఓ పోస్టుపై దేశంలోని పలువురు క్రీడాకారులతో పాటు ఎంతో మంది స్పందించిన విష‌యం తెలిసిందే. కొంద‌రు ఆమె తీరుకి వ్య‌తిరేకంగా కౌంట‌ర్ ఇస్తూ పోస్టులు ఇస్తున్నారు. అయితే, తాజాగా ఎవ‌రూ ఊహించని దేశం నుంచి ఆమెకు పోస్టుపై స్పంద‌న వ‌చ్చింది. గుర్ మెహర్‌ లాగే తాను ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ విష‌యాన్ని ప్లకార్డుల ద్వారా చెబుతూ.. గుర్మెహర్‌ కౌర్‌కి హాయ్ చెప్పాడు. త‌న పేరు ఫయాజ్‌ ఖాన్ అని, త‌న స్వస్థలం పాకిస్థాన్ అని, ప్రస్తుతం ఆస్ట్రేలియాలో చదువుతున్నాన‌ని చెప్పాడు. తాను తొలిసారి ఆస్ట్రేలియాకి వచ్చినప్పుడు తనకు స్కూల్లో భారతీయుల పట్ల ఎలా మెలగాలని చెప్పారో అలాగే ఇక్కడ కాలేజ్‌లో చదువుతున్న భారతీయుల పట్ల ఉన్నానని అన్నాడు.

ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే వారితో కలిసిపోయి మంచి స్నేహితుడిగా మారిపోయానని ఫయాజ్ చెప్పాడు. కార్గిల్‌ యుద్ధంలో ఆ విద్యార్థిని తన తండ్రిని పోగొట్టుకున్నందుకు తామంతా చింతిస్తున్నామ‌ని పేర్కొన్నాడు. ఇలాంటి యుద్ధాలు జరుగుతున్నప్పుడు చావు త‌మ‌ ఇంటికి (స్వాత్‌ ప్రాంతం) సమీపంలోనే ఉందని అన్నాడు. కానీ అదృష్టవశాత్తు తాను త‌న‌ కుటుంబాన్ని పోగొట్టుకోలేదని చెప్పాడు. కానీ అలాంటి సమయంలో ఆ విద్యార్థిని లాంటి వాళ్లని వేలల్లో చూశానని అన్నాడు. త‌న‌కు ఎలాంటి వీసా నిబంధనలు లేకుండా భారత్‌కి రావాలని ఉందని చెప్పాడు. భార‌త్, పాకిస్థాన్ ల‌ మధ్య ఉండే నిబంధనలకు వ్యతిరేకంగా పోరాడదామ‌ని పిలుపునిచ్చాడు. సరిహద్దు ప్రాంతాల్లో నీలా బాధపడుతున్నవారిని కాపాడటానికి శాంతికోసం పోరాడదామ‌ని అన్నాడు.  ఆ విద్యార్థినికి ప్రేమను పంచే తండ్రిని ఇవ్వలేను కానీ శత్రు దేశం నుంచి ఓ మంచి సోదరుడిని ఇవ్వగలనని ఫయాజ్‌ అన్నాడు.

More Telugu News