: లా అండ్ ఆర్డ‌ర్‌కి విఘాతం క‌లిగితే అరెస్టు వారెంట్ ఇచ్చే అధికారం క‌లెక్టర్ కి ఉంది : చంద్ర‌బాబు

కృష్ణా జిల్లా ముళ్లపాడులో నిన్న జరిగిన బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో నందిగామ ప్ర‌భుత్వాసుప‌త్రిలో వైఎస్ జ‌గన్మోహ‌న్ రెడ్డి కలెక్టరుతో ప్రవర్తించిన తీరుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ రోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ఆ యాక్సిడెంటుకి కలెక్టరుకి, పోలీసుల‌కి ఏమ‌యినా సంబంధం ఉందా? మీరంతా అవినీతిప‌రుల‌ంటూ జగన్ అన‌డంలో ఏమైనా అర్థం ఉందా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

‘నాకైతే అర్థం కాలేదు.. జగన్ మానసిక ప‌రిస్థితి ఎలా ఉందో.. లా అండ్ ఆర్డ‌ర్‌కి విఘాతం క‌లిగితే అరెస్టు వారెంట్ ఇచ్చే అధికారం కూడా క‌లెక్టరుకి ఉంది. అటువంటి వ్యక్తిని సెంట్రల్ జైలుకి పంపిస్తానని అన్నారు. వీళ్లకి సెంట్ర‌ల్ జైలు అనే మాట అల‌వాటైపోయింది.. జ‌గ‌న్ జైలుకి ఎప్పుడు పోతాడో ఎవ‌రికీ తెలియ‌దు.. సెంట్రల్ జైలు పదాన్ని వారు బాగా ఉపయోగిస్తుంటారు. అందుకే క‌లెక్ట‌ర్‌ను జ‌గ‌న్ సెంట్ర‌ల్ జైలుకు పంపుతాన‌న్నారు’ అని జగన్ పై చంద్ర‌బాబు చుర‌క‌లు అంటించారు. ‘ఇటువంటి వ్యాఖ్య‌లు చేస్తూ.. అందరూ అవినీతి ప‌రుల‌ని తిట్టడం ఏ మాత్రం స‌బ‌బు?.. రాష్ట్రానికి ఇలాంటి వ్యక్తులు అవసరం లేదు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

More Telugu News