: అంత కసి ఉంటే నాతో కాని, నా కుటుంబ సభ్యులతో కాని తేల్చుకోండి: వైయస్ వివేకానందరెడ్డి సవాల్

తెలుగుదేశం పార్టీ నేతలపై వైసీపీ అధినేత జగన్ బాబాయ్ వైయస్ వివేకానందరెడ్డి నిప్పులు చెరిగారు. వైసీపీ తరపున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన మాట్లాడుతూ, టీడీపీ నేతలకు అంత కసి ఉంటే తనతో కాని, తన కుటుంబ సభ్యులతో కాని తేల్చుకోవాలంటూ సవాల్ విసిరారు. స్థానిక సంస్థలకు చెందిన ప్రజా ప్రతినిధుల కుటుంబాలను అంతమొందిస్తామంటూ బెదిరించడం ప్రజాస్వామ్యంలో పనికి రాదని అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి వైసీపీకి చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లపై నిత్యం దాడులు జరుగుతున్నాయని వివేకానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులను చూస్తూ కూర్చోబోమని హెచ్చరించారు. ఈ దాడులను గమనిస్తుంటే... సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే దాడులకు తెగబడమని చెప్పినట్టు అనుమానం కలుగుతోందని చెప్పారు. కడప జిల్లాలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే సూచనలు కనిపించడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వమే దురాగతాలకు పాల్పడుతుంటే... ఎన్నికలు సవ్యంగా ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. అధికార పార్టీ అరాచకాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

More Telugu News