: గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించారని ఏఐఎస్ఎఫ్ విద్యార్థుల ఫిర్యాదు.. ఏబీవీపీ కార్యకర్తల అరెస్ట్‌

ఢిల్లీలోని రాంజాస్ కాలేజీలో గత కొన్ని రోజులుగా ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొంటున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో, ఏఐఎస్ఎఫ్ కార్య‌క‌ర్త‌ల‌తో పాటు విద్యార్థులు, లెక్చ‌ల‌ర్లు నిన్న శాంతియుత‌ ర్యాలీ చేప‌ట్టారు. విశ్వవిద్యాల‌యాల్లో హింసను వ్యతిరేకిస్తూ వారు నినాదాలిస్తూ ఇందులో పాల్గొన్నారు. అయితే, తాము ర్యాలీ నుంచి తిరిగి వస్తుండగా ఇద్ద‌రు ఏబీవీపీ కార్య‌క‌ర్త‌లు తమపై దాడిచేశార‌ని, గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించారని ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘానికి చెందిన ఇద్దరు విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో ఏబీవీపీకి చెందిన ప్రశాంత్‌ మిశ్రా, వినాయక్‌ శర్మలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మ‌రోవైపు ఈ నెల‌ 4న మండి హౌస్‌ నుంచి పార్లమెంట్‌ వరకు మళ్లీ నిరసన ర్యాలీ నిర్వహించాలని ఢిల్లీ  వ‌ర్సిటీ విద్యార్థులు నిర్ణయించారు.  ఈ నేపథ్యంలో స్పందించిన‌ ఏబీవీపీ... ఏఐఎస్ఎఫ్‌ విద్యార్థులపై దాడి చేసి అరెస్టయిన త‌మ‌ ఇద్దరు కార్య‌క‌ర్త‌ల‌ను ఏబీవీపీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పేర్కొంది. స‌ద‌రు విద్యార్థులు త‌మ‌ నియమాలను పాటించలేదని, హింసకు పాల్పడ్డారని చెప్పింది.

More Telugu News