: జయలలిత మరణంపై మాకున్న అనుమానాలు ఇవే.. రాష్ట్రపతికి వివరించిన ‘పన్నీర్’ ఎంపీలు

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ప్రజల్లో పలు అనుమానాలున్నాయని, నిజ నిర్ధారణకు సీబీఐతో విచారణ జరిపించాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన అన్నాడీఎంకే ఎంపీలు రాష్ట్రపతి ప్రణబ్‌ను కోరారు. రాజ్యసభ ఎంపీ మైత్రేయన్ నేతృత్వంలోని 12 మంది ఎంపీల బృందం మంగళవారం ప్రణబ్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించింది. జయలలితకు ఆస్పత్రిలో చేసిన చికిత్సకు సంబంధించిన వివరాలు బహిర్గతం చేయాలని కోరారు. అలాగే శాసనసభలో ప్రతిపక్షాలు లేకుండానే పళని స్వామి బలపరీక్ష నెగ్గినట్టు స్పీకర్ ప్రకటించారని, కాబట్టి విశ్వాస పరీక్షను రద్దు చేసి రహస్య ఓటింగ్‌కు ఆదేశించాలని వినతిపత్రంలో కోరారు.

దాదాపు అరగంటపాటు ప్రణబ్‌తో భేటీ అయిన ఎంపీలు జయ మృతిపై తమకున్న అనుమానాల గురించి ఆయనకు వివరించారు. అనంతరం మైత్రేయన్ విలేకరులతో మాట్లాడారు. జయ ఆస్పత్రిలో చేరడానికి ముందు పోయెస్‌గార్డెన్‌లో ఏం జరిగిందో చెప్పాలని శశికళను డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో ఉన్న ‘అమ్మ’ను చూసేందుకు పన్నీర్ సెల్వాన్ని  సైతం అనుమతించలేదన్నారు. డిసెంబరు 4న జయకు గుండెపోటు వచ్చినట్టు చెబుతున్న వైద్యులు ఆమెకున్న వెంటిలేటర్‌ను ఎవరి అనుమతితో తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో జయను తాను చూశానంటూ మంత్రి సెంగొట్టయ్యన్‌ కట్టుకథ చెబుతున్నారని విమర్శించారు. జయ మృతిపై తమకున్న అనుమానాలను నివృత్తి చేసేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్రపతిని కోరినట్టు మైత్రేయన్ వివరించారు.

More Telugu News