: ఏంటీ లెక్కలు.. భోజనానికి రూ.75 లక్షలా?.. హెచ్‌సీఏ తీరుపై హైకోర్టు విస్మయం

హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) చేసిన ఖర్చులపై హైకోర్టు విస్మయం చెందింది. ఒక్క భోజనం ఖర్చునే రూ.75 లక్షలుగా చూపడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మ్యాచ్‌ను పర్యవేక్షించిన బీసీసీఐ ప్రతినిధి రత్నాకర్ షెట్టి సీల్డ్ కవరులో అందించిన నివేదికను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం పరిశీలించింది.

నివేదికలోని అంశాలు ‘భయంకరంగా’ ఉన్నాయని వ్యాఖ్యానించింది. మ్యాచ్ సందర్భంగా 2వేల మంది పోలీసులు విధులు నిర్వర్తించారని, వారి భోజనాల కోసం ఏకంగా రూ.75 లక్షలు ఖర్చు చేశామన్న హెచ్‌సీఏ లెక్కలపై కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అలాగే స్టేడియం  సామర్థ్యంలో 25 శాతం టికెట్లను కాంప్లిమెంటరీ కింద ఇవ్వడాన్ని కూడా ధర్మాసనం తప్పుబట్టింది. హెచ్‌సీఏ వ్యవహారం ఆశ్చర్యపరిచేలా ఉందని వ్యాఖ్యానించిన ధర్మాసనం పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని పేర్కొంటూ తదుపరి విచారణను పది రోజులు వాయిదా వేసింది. జస్టిస్ లోథా కమిటీ సిఫార్సుల మేరకు హెచ్‌సీఏకు ఎన్నికలు నిర్వహించడం లేదంటూ న్యాయవాది గోవిందరెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన కోర్టు పైవిధంగా వ్యాఖ్యానించింది.

More Telugu News