: బస్సు ప్రమాదం ఎలా జరిగిందంటే.. సీఎం చంద్రబాబుకు వివరించిన డీజీపీ!

కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి గల కారణాలను ఏపీ డీజీపీ సాంబశివరావు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి వివరించారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని, దుర్ఘటన జరిగిన వెంటనే నిమిషాల్లోనే పోలీసులు స్పందించి సహాయ కార్యక్రమాలు చేపట్టారని, క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారని సీఎంకు తెలిపారు. దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన బస్సును ఏడాది క్రితమే కొనుగోలు చేశారని, దాని కండిషన్ బాగుందన్నారు.

ఈ సందర్భంగా రోడ్డు డిజైన్‌లో ఏమైనా లోపాలు ఉన్నాయా? అంటూ అని అధికారులను ప్రశ్నించిన చంద్రబాబు ఈ విషయాన్ని పరిశీలించి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. ప్రమాదం జరుగుతున్న ప్రాంతంలో ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేవంటూ రవాణాశాఖ అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన చంద్రబాబు టోల్ కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టోలు వసూలుకు మాత్రం ఎక్కడపడితే అక్కడ బోర్డులు పెడతారు కానీ ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టరా? అంటూ నిలదీశారు. బస్సు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

More Telugu News