: కన్సాస్ వార్తలు కలత పెడుతున్నాయి: శ్రీనివాస్ హత్యపై స్పందించిన ట్రంప్

కన్సాస్ సమీపంలోని ఓ బార్ లో హత్యకు గురైన కూచిభొట్ల శ్రీనివాస్ ఉదంతంపై డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా స్పందించారు. ఈ కాల్పుల ఘటన, ఆపై కన్సాస్ నుంచి వెలువడుతున్న వార్తలు తనను కలచివేశాయని ట్రంప్ వ్యాఖ్యానించినట్టు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ పేర్కొన్నారు. బుధవారం జరిగిన కాల్పుల్లో శ్రీనివాస్ మరణించగా, ఆయన స్నేహితుడు అలోక్, మరో అమెరికన్ తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనను జాతి విద్వేష పూరిత చర్యగా అభివర్ణించడం తగదని, ఇటువంటి చర్యలను ఎవ్వరూ సమర్థించబోరని ట్రంప్ వ్యాఖ్యానించినట్టు స్పైసర్ పేర్కొన్నారు. కాగా, భారత విదేశాంగ శాఖ కార్యదర్శి జై శంకర్, తన నాలుగు రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు చేరుకుని, హెచ్-1బీ వీసాల విషయంతో పాటు, ఇండియన్స్ పై దాడుల గురించి యూఎస్ అధికారులతో చర్చించనున్న నేపథ్యంలో వైట్ హౌస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

"అమెరికా పౌరుల స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను పరిరక్షించడమే మా విధి. ఇక్కడ స్వేచ్ఛగా సంచరించేందుకు ఏ ఒక్కరు కూడా భయపడకుండా చూస్తాం. ఎవరి మతాన్ని వారు ఎలాంటి సంకోచం లేకుండా అవలంబించవచ్చు. అమెరికన్ జాతి సూత్రాలను కాపాడేందుకు అధ్యక్షుడు కట్టుబడివున్నారు" అని స్పైసర్ వ్యాఖ్యానించారు. కేసు విచారణలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు సైతం భాగం పంచుకుంటున్నారని తెలిపారు. కాగా, అధ్యక్షుడు ట్రంప్ ఈ కాల్పుల ఘటనపై ప్రత్యక్షంగా స్పందించకపోవడాన్ని హిల్లరీ క్లింటన్, బెర్నీ శాండర్స్ సహా పలువురు బహిరంగంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News