: ఇకపై రైల్లో వంట వేరు, వడ్డన వేరు: కొత్త క్యాటరింగ్ పాలసీ ఆవిష్కరణ

భారతీయ రైల్వేల్లో వంటను, వడ్డనను విభజిస్తూ కొత్త క్యాటరింగ్ సర్వీస్ పాలసీని ఆ శాఖ మంత్రి సురేష్ ప్రభు విడుదల చేశారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సూచనలపై నిపుణుల కమిటీ చర్చించిన తరువాత, నాణ్యమైన ఆహారం, ప్రయాణికుల ఆరోగ్య భద్రత లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా ప్రభు వ్యాఖ్యానించారు. ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన వంటగదుల్లో వంటలు తయారవుతాయని, వాటిని ఆతిథ్య రంగంలోని సేవా సంస్థల ద్వారా ప్రయాణికులకు అందిస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు పేరున్న ఫుడ్ చెయిన్ సంస్థలతో ఒప్పందాలు కుదిరాయని తెలిపారు.

కాగా, కొత్త పాలసీతో, గత ఏడేళ్లుగా రైల్వే శాఖకు అనుబంధంగా నడుస్తూ, ఫుడ్ క్యాటరింగ్ సేవలను పర్యవేక్షిస్తున్న ఐఆర్సీటీసీ, ఇకపై ఆహార సరఫరా సేవలకు దూరం కానుంది. ఇకపై దశలవారీగా ఐఆర్సీటీసీ తన సేవలను విరమించుకుంటుందని, ఈ మేరకు చర్యలు చేపట్టనున్నామని గత సంవత్సరం రైల్వే బడ్జెట్ లో ప్రభు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక కొత్త పాలసీలో భాగంగా, ఏ రైళ్లలో ఎటువంటి ఆహారం అందించాలన్న విషయం నుంచి, ఆహార పదార్థాలకు ధరను నిర్ణయించడం వరకూ ఐఆర్సీటీసీకే అధికారాన్ని కట్టబెడుతూ, రైల్వే కాటరింగ్ పాలసీ-2017లో ఆదేశాలు జారీ అయ్యాయి. అన్ని రైల్వే స్టేషన్లలోని స్టాల్స్ లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కూడా విధానపరమైన నిర్ణయాన్ని ఈ పాలసీలో తీసుకున్నారు. స్వయం సహాయక బృందాలు ముందుకు వస్తే, క్యాటరింగ్ అవకాశాన్ని అందించనున్నామని, అన్ని స్టేషన్లలో ఓపెన్ టెండర్ విధానం ద్వారా పాల కేంద్రాలను తెరుస్తామని ఈ సందర్భంగా సురేష్ ప్రభు వ్యాఖ్యానించారు.

More Telugu News