: న్యాయవాద వృత్తి నుంచి 'ప్రజారాజ్యం'లో ఓటమి వరకూ... శివశంకర్ రాజకీయ ప్రస్థానం!

ఇందిరాగాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉండి కేంద్ర మంత్రిగా, సిక్కిం, కేరళ రాష్ట్రాల గవర్నర్ గా విధులు నిర్వర్తించిన పి. శివశంకర్ మరణంతో కాంగ్రెస్ పార్టీ ఓ సీనియర్ నేతను కోల్పోయినట్లయింది. హైదరాబాద్ లో 1929, ఆగస్టు 10న జన్మించిన ఆయన, అమృతసర్ లో బీఏ చదివారు. ఆపై ఉస్మానియా యూనివర్శిటీలో న్యాయశాస్త్ర విద్యను అభ్యసించి పట్టాను పొందారు. 1974 - 75 మధ్య కాలంలో హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. ఆపై రాజకీయాల్లోకి వచ్చి, తనదైన వాగ్ధాటి, మాట చతురతతో ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. 1978లో తొలిసారిగా సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ పడి విజయం సాధించారు. ఆపై 1980లో జరిగిన ఎన్నికల్లోనూ అక్కడి నుంచే గెలిచారు. ఆ సమయంలో శివశంకర్ నాయకత్వ లక్షణాలను, ఆయనలోని న్యాయ విభాగ నైపుణ్యాన్ని గమనించిన ఇందిరాగాంధీ న్యాయశాఖకు మంత్రిగా ఎన్నుకున్నారు.

ఆపై 1985లో రాజ్యసభకు ఎన్నికైన ఆయన రాజీవ్ గాంధీ మంత్రివర్గంలోనూ స్థానం సంపాదించుకున్నారు. అప్పుడే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగానూ పనిచేశారు. 1989 - 91 మధ్య కాలంలో ప్రతిపక్ష నేతగా నిలిచారు. 1994లో సిక్కింకు, ఆపై 1995లో కేరళకు గవర్నర్ గా పనిచేశారు. 1998 ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ పడి ఓడిపోయారు. 2004లో కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చడం లేదంటూ బయటకు వచ్చి, నాలుగేళ్ల పాటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న శివశంకర్, చిరంజీవి ప్రజారాజ్యాన్ని స్థాపించిన తరువాత ఆ పార్టీలో చేరారు. ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఓటమిని చవిచూశారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైన తరువాత, అధికారికంగా కాంగ్రెస్ లో కొనసాగుతున్నప్పటికీ, వయసు మీదపడటంతో క్రియాశీలకంగా మాత్రం లేరు. ఈ ఉదయం ఆయన తన స్వగృహంలో మరణించారు.

More Telugu News