: ఆ ఉపగ్రహాలతో భారత్ కు పెను ముప్పు: మాధవన్ నాయర్ సంచలన వ్యాఖ్య

రెండు వారాల క్రితం ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి విజయవంతం చేసిన పీఎస్ఎల్వీ ప్రయోగంపై మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 104 శాటిలైట్స్ ను ఒకే రాకెట్ ద్వారా ప్రయోగించి విజయవంతం అయిన రోజున, ఇస్రోకు 400 ఉపగ్రహాలనైనా ఒకేసారి ప్రయోగించే సత్తా ఉందని అభినందించిన ఆయన, ఇప్పుడు ఈ తరహా ప్రయోగాలు సరికాదని హితవు పలికారు. ఇటువంటి ప్రయోగాలతో భవిష్యత్తులో పెనుముప్పు సంభవిస్తుందని అన్నారు.

భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకోకుండా ఇస్రో ముందడుగు వేసిందని, ఈ 104 ఉపగ్రహాల్లో మూడు మాత్రమే భారత్ వని గుర్తు చేసిన ఆయన, డబ్బుల కోసం ఇష్టానుసారం ఉపగ్రహాలను పంపరాదని సలహా ఇచ్చారు. వీటి జీవితకాలం స్వల్పమని చెప్పిన ఆయన, ఆపై ఇవన్నీ అంతరిక్షంలో వ్యర్థాలుగా మారుతాయని, నియంత్రణ లేక దిశారహితంగా తిరుగుతూ ఉంటాయని, ఒక్కోసారి పనిచేస్తున్న ఉపగ్రహాలను ఢీకొట్టే ప్రమాదముందని హెచ్చరించారు. అటువంటప్పుడు కోట్లాది రూపాయల ధనం పనికిరాకుండా పోతుందని, భారత అవసరాల కోసం పంపిన శాటిలైట్లు సైతం నిరుపయోగం కావచ్చని అభిప్రాయపడ్డారు.

More Telugu News