: ఏటీఎంలలో మళ్లీ అదే తీరు.. వరుస సెలవులతో దర్శనమిస్తున్న ‘నో క్యాష్’ బోర్డులు

ఏటీఎంలలో మళ్లీ నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. శుక్రవారం శివరాత్రి, ఆఖరు శనివారం, ఆదివారం.. ఇలా వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు రావడంతో ఏటీఎంలు ఖాళీ అయిపోయాయి. నింపే నాథుడు లేక దిష్టిబొమ్మల్లా కనిపిస్తున్నాయి. డబ్బులు దొరక్క ఆదివారం హైదరాబాద్ నగర వాసులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సెలవులను ముందే గ్రహించిన కొందరు ఏటీఎంల నుంచి పెద్దమొత్తంలో ముందే డ్రా చేసి పెట్టుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తోంది.

నగరంలో 70 శాతం ఏటీఎంలలో నగదు నిండుకుంది. డబ్బుల కోసం ఆశగా వచ్చిన వారు నిరాశగా వెనుదిరుగుతున్నారు. బ్యాంకులు, ఏటీఎంలలో నగదు నింపే ఏజెన్సీల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తినట్టు రిటైర్డ్ బ్యాంకు అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు బ్యాంకుల తీరుపై ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులు సెలవులు వస్తున్నాయని తెలిసినా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంపై మండిపడుతున్నారు.

More Telugu News