: 'కబాలి' సినిమాపై దుష్ప్రచారం తగదంటున్న ఎగ్జిబిటర్.. వాట్స్ యాప్ సందేశంలో వివరణ!

కోలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలపై రెడ్ కార్డ్ ప్రయోగించాలన్న డిమాండ్ ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తోంది. ఆమధ్య వచ్చిన 'కబాలి' సినిమా పంపిణీదారులను దారుణమైన నష్టాల్లో ముంచిందని, ఈ సినిమా కలెక్షన్లపై వాస్తవాలు రజనీకాంత్ కు తెలియవని కోలీవుడ్ పంపిణీదారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో సేఫ్ జోన్ లో ఉండాలంటే ఏడుగురు అగ్రహీరోలపై రెడ్ కార్డ్ ప్రయోగించాలన్న చర్చ నడుస్తోంది.

అయితే, దీనిని ఖండిస్తూ, కబాలి సినిమా లాభాలు తెచ్చిపెట్టిందని పేర్కొంటూ,  ఓ ధియేటర్ యజమాని, సినిమా పంపిణీ దారుడు తన అనుభవాలను వాట్స్ యాప్ మాధ్యమంగా చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ లో పెను కలకలం రేపుతున్నాయి. 'మధురైలో నాకో సొంత థియేటర్‌ ఉంది. అందులో ‘కబాలి’ 217 రోజులు ప్రదర్శితమైంది. ఈ రోజు కూడా 'కబాలి' మార్నింగ్‌ షో 47 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. రెగ్యులర్‌ గా జనం వస్తున్నారు. 'కబాలి' సినిమాపై ఇతర పంపిణీదారులు చేసిన ఆరోపణలు ఎస్.థాను, రజనీ సార్‌ లను అవమానించేలా వున్నాయి. ఒక పంపిణీదారుడిగా, థియేటర్‌ యజమానిగా చెబుతున్నా.. ప్రతి వ్యాపారంలో లాభనష్టాలు సహజం. అలా అని ఇలా ప్రత్యేకంగా కొంతమంది పేర్లు చెప్పి దుష్ప్రచారం చేయడం తగదు. ‘కబాలి’ ఘనవిజయం సాధించింది. మధురై ఏరియాలో లాభాలు తెచ్చిపెట్టింది’ అని తెలిపారు. దీంతో ఈ వాట్స్ యాప్ ప్రకటన కోలీవుడ్ లోని పంపిణీదారుల్లో కలకలం రేపుతోంది.

More Telugu News