: సీఎంలకు సంచులు మోసిన బతుకులు మీవి: కేసీఆర్

దేశంలో ఏ ప్రభుత్వానికీ రాని గొప్ప అవకాశం కాంగ్రెస్ కు వచ్చిందని... 40 ఏళ్ల పాటు ఆ పార్టీని దేశ ప్రజలు అధికార పీఠంపై కూర్చోబెట్టరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదని చెప్పారు. సంక్షేమాన్ని పక్కన పెట్టిన కాంగ్రెస్ నేతలు, ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే, ఈరోజు టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించి అధికార పీఠంపై కూర్చోబెట్టారని అన్నారు.

ఆరు దశాబ్దాల పాటు నిరాదరణకు గురైన రాష్ట్రంలో ప్రాజెక్టులను కట్టడానికి తాము ప్రయత్నిస్తుంటే... కాంగ్రెస్ నేతలు అడుగడుగునా అడ్డుకుంటున్నారని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో ఎక్కడైనా ఒక ప్రాజెక్టు కోసం శంకుస్థాపన జరిగినా, ప్రజలను రెచ్చగొట్టి అక్కడకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణ అనుమతులు లేవంటూ గ్రీన్ ట్రైబ్యునల్ కు వెళుతున్నారని, ఇంతకన్నా దారుణం మరొకటి లేదని మండిపడ్డారు.

'ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రులకు సంచులు మోసిన బతుకులు మీవి' అంటూ కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర అభివృద్ధి నిరోధకులు కాంగ్రెస్ నేతలు అంటూ విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుండటంతో... కాంగ్రెస్ నేతలకు దిక్కుతోచడం లేదని అన్నారు. ఎన్నికల సమయంలో చీప్ లిక్కర్ పంచడం తప్ప కాంగ్రెస్ నేతలకు మరేమీ పట్టదని విమర్శించారు. 

More Telugu News