: కాల్పులకు ఎదురొడ్డిన ఆ అమెరికన్ ఏమంటున్నాడంటే..!

అమెరికాలోని కాన్సస్ లో తెలుగువారిపై అమెరికా మాజీ సైనికుడు ఆడమ్ పురింటన్ (51) కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో శ్రీనివాస్ అనే కుర్రాడు మరణించగా, అలోక్ అనే యువకుడు గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. సాధారణంగా పక్కనే కాల్పులు జరుగుతుంటే, ఎవరైనా సరే ప్రాణాలు దక్కించుకునేందుకు ఆ ఘటనాస్థలం నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఇయాన్ గ్రిలియట్ (24) అనే అమెరికన్ మాత్రం అలా చేయలేదు. ప్రాణాలకు తెగించాడు. అందర్లా వెన్నుచూపి పారిపోకుండా కాల్పులకు ఎదురెళ్లాడు. అతని చేతుల్లోంచి తుపాకి లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతని భుజం, చేతుల్లో బుల్లెట్లు దిగినా పట్టించుకోలేదు.

నిందితుడ్ని కిందపడేసి బంధించే ప్రయత్నం చేశాడు. తీవ్ర రక్తస్రావంతో స్పృహ కోల్పోతున్న దశలో నిందితుడు పారిపోయాడు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గ్రిలియట్ ను ఆసుపత్రిలో చేర్చారు. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న గ్రిలియట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో జరిగిన ఘటనపై స్పందిస్తూ... తానేమీ గొప్పపని చేయలేదని, అలాంటి సందర్భంలో ఇతరులు ఎలా స్పందిస్తారో తాను కూడా అదే చేశానని చెప్పాడు. అయితే తాను బతికి బట్టకట్టడం గొప్ప విషయమేనని అన్నాడు.

అతను ఎక్కడి నుంచి వచ్చాడో తనకు తెలియదని, అతని జాతి కూడా తమకు తెలియదని అన్నాడు. ముందుగా మనమంతా మనుషులమని చెప్పాడు. ఈ ఘటనను వర్ణించేందుకు తనకు మాటలు రావడం లేదని ఆయన చెప్పాడు. అలోక్ మాదసాని తనను పరామర్శిచేందుకు వచ్చాడని, ఆ సందర్భంగా అతని భార్య ఐదు నెలల గర్భవతి అని తెలిపాడని, అతనికి ఏమైనా జరిగి ఉంటే అతని కుటుంబం పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించాడు. దీంతో ఇయాన్ గ్రిలియట్ ను అంతా హీరోగా అభివర్ణిస్తున్నారు.

More Telugu News