: ఆ ప్రోగ్రాం పచ్చి మోసం..!: చిరంజీవి 'మీలో ఎవరు కోటీశ్వరుడు' టీవీ షోపై యండమూరి తీవ్ర వ్యాఖ్యలు

ఒకప్పుడు మంచి మిత్రులుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ లకు ప్రస్తుతం ఏమాత్రం పడటం లేదు. రామ్ చరణ్ పై యండమూరి తీవ్ర వ్యాఖ్యలు చేయడం... యండమూరిపై నాగబాబు మండిపడటం... ఇవన్నీ చూశాం. తాజాగా చిరంజీవి హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' టీవీ ప్రోగ్రాంపై యండమూరి సంచలన వ్యాఖ్యలు చేశారు.

'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమం అతి పెద్ద మోసం అని యండమూరి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ పోటీలో పాల్గొనాలంటే, ముందుగా మూడు మెసేజ్ లు పంపాల్సి ఉంటుందని... ఒక్కో మెసేజ్ కు ఐదు రూపాయలు కట్ అవుతుందని చెప్పారు. అంటే, ఒక్కొక్కరు పదిహేను రూపాయలు చెల్లించుకుంటారని... ఈ రకంగా 10 లక్షల మంది మెసేజ్ లు పంపితే, నిర్వాహకుల జేబులోకి రూ. 1.5 కోట్లు వెళతాయని తెలిపారు. ఆ తర్వాత పోటీలో పాల్గొనే వారికి కుక్క బిస్కెట్లు వేసినట్టు ఐదు, ఆరు లక్షలు విసురుతారని మండిపడ్డారు. ఆ కుక్క బిస్కెట్లను మనం చొంగ కార్చుకుంటూ తీసుకుంటున్నామని విమర్శించారు.

నిరుపేదలు సైతం ఎంతో ఆశతో ఈ కార్యక్రమానికి మెసేజ్ లు పంపుతున్నారని యండమూరి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకంటే మోసం మరొకటి లేదని... దీని కంటే లాటరీ టికెట్ కొనుక్కోవడం చాలా మేలని సూచించారు. లాటరీలను బ్యాన్ చేసినట్టే... ఇలాంటి కార్యక్రమాలను కూడా ప్రభుత్వాలు నిషేధించాలని డిమాండ్ చేశారు.

More Telugu News