: బంగ్లా ఖాళీ చేయమన్న ప్రభుత్వం... అద్దె ఇంటి కోసం వెతుకుతున్న పన్నీర్ సెల్వం!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ దెబ్బకు ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన పన్నీర్ కు కొత్త సమస్య వచ్చి పడింది. సీఎం పదవి కోల్పోవడంతో... ప్రభుత్వం కేటాయించిన అధికారిక నివాసాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఆయనకు పీడబ్ల్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, ఆయన అద్దె ఇంటిని వెతుక్కునే పనిలో పడ్డారు.

2011లో అన్నాడీఎంకే గెలుపొందిన తర్వాత పన్నీర్ సెల్వం ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. అప్పుడు ఆయనకు చెన్నైలోని గ్రీన్ వేస్ రోడ్డులో ఉన్న పీడబ్ల్యూడీకి చెందిన బంగ్లాను కేటాయించారు. జయలలిత జైలుకు వెళ్లిన తర్వాత పన్నీర్ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు కూడా ఆయన ఆ బంగ్లా మారకుండా అదే ఇంట్లో ఉంటున్నారు. తాజాగా పదవిని కోల్పోవడంతో, బంగ్లాను ఖాళీ చేయాలని ఆయనకు ఆదేశాలు జారీ అయ్యారు.

వాస్తవానికి పదవిని కోల్పోయినా... జనాల్లో మాత్రం పన్నీర్ సెల్వంకు క్రేజ్ బాగానే ఉంది. ప్రతి రోజు ఆయనను కలవడానికి భారీ సంఖ్యలో అన్నాడీఎంకే కార్యకర్తలు ఆయన నివాసం వద్దకు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో, పీడబ్ల్యూడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. బంగ్లాను ఖాళీ చేయడానికి ఆరు నెలల సమయం ఇవ్వాలని పన్నీర్ వర్గీయులు కోరుతున్నారు. అయినప్పటికీ, ఆ నివాసాన్ని ఖాళీ చేయాలనే నిర్ణయానికి పన్నీర్ వచ్చేశారని తెలుస్తోంది.

More Telugu News