: కడు పేదరికంలో మగ్గుతున్న పూలన్ దేవి తల్లీ చెల్లీ!

బందిపోటు రాణి అంటే ఫూలన్ దేవి గుర్తుకొస్తారు. బందిపోటు రాణిగా భూస్వాముల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన ఆమె లోక్ సభ సభ్యురాలిగా రెండు సార్లు విజయం సాధించి, తదనంతర కాలంలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. చంబల్ లోయలో ఫూలన్ దేవి అంటే భూస్వాములు గజగజ వణికేవారు. అక్కడ పెత్తందారీ వర్గమైన ఠాకూర్లను లక్ష్యం చేసుకుని ఆమె పేదలకు అండగా నిలబడ్డారని చంబల్ లోయలో చెబుతుంటారు. ఆమె బందిపోటు రాణిగా ఉన్నప్పుడు ఆమె కుటుంబం అంటే పెత్తందార్లు హడలిపోయేవారు. ఆమె తల్లి వీధిలోకి వస్తే అంతా వంగివంగి సలాములు చేసేవారు. ఆమెను చూసేందుకు భారీ ఎత్తున జనం పోగయ్యేవారు. 1980 ప్రాంతంలో ఫూలన్ దేవిని పట్టుకునేందుకు పోలీసులు కూడా సాహసించలేదు.

అలాంటి ఫూలన్ దేవి 1983లో స్వచ్ఛందంగా లొంగిపోయారు. అప్పటికి ఆమెపై 48 కేసులున్నాయి. వాటన్నింటినీ ములాయం సింగ్ ప్రభుత్వం కొట్టివేసింది. దీంతో 1994లో ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. అప్పటికి చాలా సార్లు ఆమెపై హత్యాయత్నాలు జరిగాయి. వాటన్నింటిని చాకచక్యంగా తప్పించుకుని ఆమె తాను బందిపోటు రాణి ఎందుకయ్యానో గుర్తుచేసేవారు. ఈ క్రమంలో ఆమె మీర్జాపూర్ నియోజకవర్గం నుంచి జరిగిన మధ్యంతర ఎన్నికల్లో 1996లో పోటీ చేసి విజయం సాధించారు. అలాగే తరువాత 1999లో జరిగిన ఎన్నికల్లో కూడా విజయం సాధించి, 2001 జూలై 25న తన అధికారిక నివాసం బయట జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఫూలన్ దేవి కుటుంబంలోని తల్లి, చెల్లికి ఆదరణ కరవైంది.

ఉన్న భూమిని వారి నుంచి ఠాకూర్లు లాగేసుకున్నారు. ఫూలన్ స్థానంలో ఆమె చెల్లెలిని పార్లమెంటుకు పంపుతానని ములాయం హామీనిచ్చి మర్చిపోయారు. ఈ నేపథ్యంలో ఓ సర్వే కోసం వెళ్లిన స్వచ్ఛంద సంస్థకు ఫూలన్ దేవి తల్లి, చెల్లి అత్యంత దీనావస్థలో కనిపించారు. ఫూలన్ దేవి తల్లి మూలాదేవి నులకమంచానికి పరిమితం కాగా, ఫూలన్ దేవి చెల్లెలు రామ్ కలి కూడా అనారోగ్యంతో కనిపించారు. ఈ సమయంలో స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలకు ఫూలన్ దేవి ఇంట్లో కొంచెం గోధుమ పిండి, పావుకేజీ ఉల్లిపాయలు మాత్రమే కనిపించాయి. దీనిని బట్టి, 17 ఏళ్ల క్రితం ఎంపీగా పని చేసిన మహిళ ఇంట్లో ఇంత దుర్భరమైన పరిస్థితులా? అని ఆశ్చర్యపోయారు.  

More Telugu News