: తలుపులు బద్ద‌లు కొట్టి మరీ తీసుకెళ్లారు.. నా భ‌ర్త ఎక్క‌డున్నారు?: కోదండ‌రాం స‌తీమ‌ణి

నిరుద్యోగ నిర‌స‌న‌ ర్యాలీకి పిలుపునిచ్చిన టీజేఏసీ ఛైర్మ‌న్ కోదండ‌రాంను ఈ రోజు తెల్ల‌వారు జామున హైద‌రాబాద్ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లిన నేప‌థ్యంలో ఈ రోజు ఆయ‌న భార్య సుశీల న‌గ‌ర‌ పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌ రెడ్డిని కలిసిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ... త‌న‌ భ‌ర్త‌ను తెల్లవారు జామున అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అన్నారు. కోదండ‌రాం నిర్వ‌హించ‌ త‌ల‌పెట్టిన‌ ర్యాలీలో సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయంటున్నార‌ని, అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్ర‌ ఉద్యమానికి మద్దతిచ్చింది కూడా వారేనా? అని ఆమె ప్ర‌శ్నించారు.

ఉదయం 6గంటలకు బయటకు వస్తానని పోలీసులకి చెప్పినప్ప‌టికీ, వారు వినిపించుకోకుండా ఈ రోజు తెల్లవారు జామున 3.30గంటల ప్రాంతంలో త‌మ ఇంటి తలుపులు బద్ద‌లు కొట్టి, తన భర్తను తీసుకెళ్లార‌ని ఆమె ఆరోపించారు. అసలు ఆయన ఎక్కడున్నారని ఆమె ప్రశ్నించారు.‌ దొంగలు, దోపిడీదారులు తమ వద్ద ఉన్నట్లు పోలీసులు ప్రవర్తించారని, కోదండ‌రాంను పోలీసులు వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
 
జేఏసీ తరపు అడ్వకేట్‌ రచనా రెడ్డి మాట్లాడుతూ...  తలుపులు పగులగొట్టి మ‌రీ ఆయ‌న‌ను అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంద‌ని నిల‌దీశారు. అరెస్టు చేసిన‌ప్ప‌టి నుంచి ఇప్పటి వరకు ఆయనను ఎక్కడ ఉంచారో ఎవరికీ తెలియదని అన్నారు. కోదండ‌రాంను వెంటనే విడుదల చేయాలని, పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

More Telugu News