: అందరూ చెప్పినా.. పవన్ కల్యాణ్ కు ఇంకా అర్థం కాలేదా?: తమ్మారెడ్డి భరద్వాజ సూటి ప్రశ్న

ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ పై సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ 'నా ఆలోచన' పేరిట యూ ట్యూబ్ ద్వారా పలు విమర్శలు చేశారు. చేనేత గర్జన సభ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగంపై ఆయన పెదవి విరిచారు. చేనేత కార్మికుల గురించి, జనసేన వెబ్ సైట్ గురించి బాగా మాట్లాడిన పవన్ కల్యాణ్ ప్రత్యేకహోదాపై మరోసారి నిరాశపడేలా మాట్లాడారని అన్నారు. పవన్ కల్యాణ్ ప్రతిసభలోనూ ప్రత్యేకహోదా ఎందుకు వద్దంటున్నారో రాజకీయ నాయకులు ప్రజలకు సరళమైన భాషలో వివరించాలని కోరుతున్నారని, అయితే, వాస్తవానికి వారంతా ఎందుకు హోదా ఇవ్వడం లేదో విడమరచి చెప్పేశారని అన్నారు.

అయితే గతంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పవన్ కల్యాణ్ కు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడినట్టు మాట్లాడి వివరించలేదని అన్నారు. పవన్ కల్యాణ్ కు అలా చెబితే సరిపోతుందా? అని ఆయన ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వమని బీజేపీ, రాదని టీడీపీ స్పష్టంగా చెబుతున్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కు చేతనైతే పోరాటం చేయాలని ఆయన సూచించారు. జనవరి 26న ప్రత్యేకహోదా సాధన ఆందోళనకు పిలుపునిస్తే, సంపూర్ణేష్ బాబు మద్దతుగా వచ్చి అరెస్టయ్యాడని, పవన్ కల్యాణ్ మాత్రం రాలేదని ఆయన గుర్తు చేశారు. అమెరికాలోనూ, ఇక్కడా పదేపదే ప్రత్యేకహోదా కోసం పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నాడని, మాటలు కాదు చేతలు కావాలని ఆయన గుర్తించాలని తమ్మారెడ్డి సూచించారు.

రాజకీయ పార్టీలన్నీ 2019లో విజయం సాధించేందుకు ప్రత్యేకహోదాను తలకెత్తుకుంటున్నాయని ఆయన తెలిపారు. అలా కాకుండా పవన్ కల్యాణ్ హోదాపై ఉద్యమానికి రావాలని ఆయన సూచించారు. అలా చేస్తే ప్రజలంతా ఆయన వెనుక ఉంటారని ఆయన చెప్పారు. పవన్ కల్యాణ్ ఫిరంగులకు గుండెలడ్డంపెట్టేవారు తనకు కావాలంటున్నారని, ప్రత్యేకహోదా పోరాటం కోసం జనవరి 26న అరెస్టైన వారంతా అలాంటి వారు కాదా? అని ఆయన నిలదీశారు. ప్రజాపక్షాన నిలబడాలనే పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడని భావిస్తున్నామని, అది నిజం కావాలంటే పవన్ కల్యాణ్ మాటలు తగ్గించి, కార్యరంగంలోకి దూకాలని ఆయన సలహా ఇచ్చారు.

More Telugu News