: నేడు ముంబైలో సత్య నాదెళ్లతో చంద్రబాబు భేటీ.. పలు కీలక ఒప్పందాలపై సంతకాలు

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు(బుధవారం) ముంబైలో భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని మైక్రోసాఫ్ట్‌కు చెందిన ‘హైబ్రిడ్ క్లౌడ్’ విధానంలో భద్రపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ‘లింక్‌డిన్’ను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో నేడు చంద్రబాబు, నాదెళ్ల సమక్షంలో రాష్ట్ర ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐటీ శాఖలు మైక్రోసాఫ్ట్‌తో కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి.

 ప్రస్తుతం ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, ప్రజలకు సంబంధించిన ఇతర సమాచారం వివిధ శాఖల వద్ద మాత్రమే ఉంది. శాఖల వారీగా అనుసంధానం కాకపోవడంతో కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం ఆ సమాచారమంతా కంప్యూటర్లలో, డిస్కుల్లోనే భద్రపరుస్తూ వస్తున్నారు. కంప్యూటర్‌కెక్కని సమాచారం ఫైళ్లలో ఉంటోంది. దీనివల్ల ప్రభుత్వంపై ఏటా కోట్లాది రూపాయల భారం పడుతోంది.

ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఆ సమాచారం ఏపీ స్టేట్ డేటా పేరుతో క్లౌడ్‌లో భద్రపరచనుంది. ఇందుకు సంబంధించిన సాంకేతికపరమైన సహకారాన్ని మైక్రోసాఫ్ట్ అందిస్తుంది. ఒకసారి సమాచారం భద్రపరిస్తే ప్రపంచంలోని ఎక్కడి నుంచైనా సమాచారాన్ని ఒక్క క్లిక్‌తో తెలుసుకునే వీలుంటుంది. అంతేకాదు సమాచారం కూడా పూర్తిగా గోప్యంగా, భద్రంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

More Telugu News