: నోటిచ్చి ఓటడిగితే ముందు అరెస్టే.. తర్వాత తీరిగ్గా దర్యాప్తు.. ఓకే చెప్పిన రాష్ట్రాలు!

నోట్లిచ్చి ఓట్లు గుద్దించుకోవాలని ఆశపడే నాయకులకు ఇది బ్యాడ్ న్యూస్. ఓట్లు కొంటూ దొరికిన వారిని ముందు అరెస్ట్ చేసి ఆ తర్వాత దర్యాప్తు జరపాలన్న ఎలక్షన్ కమిషన్ ప్రతిపాదనలకు దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు ఓకే చెప్పాయి. ఎన్నికల్లో అవినీతిని రూపు మాపేందుకు ఎన్నికల సంఘం తెచ్చిన ఈ ప్రతిపాదనకు అస్సాం, గుజరాత్, హరియాణా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు తప్ప మిగతా రాష్ట్రాలన్నీ ఆమోదం తెలిపాయి. ఇప్పటి వరకు ఎన్నికల్లో అవినీతికి  పాల్పడినట్టు బలమైన ఆధారాలుంటేనే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. కానీ తాజా ప్రతిపాదన అమల్లోకి వస్తే ఆరోపణలు రాగానే తొలుత అరెస్ట్ చేసి ఆ తర్వాత దర్యాప్తు చేస్తారు.

'పోల్ అవినీతి'ని కేసుపెట్టదగిన నేరాల పరిధిలోకి తీసుకువస్తే కనక అరెస్ట్ వారెంట్ లేకుండానే పోలీసులు అదుపులోకి తీసుకునే వీలుంటుంది. అయితే ఇందుకోసం తొలుత సీఆర్‌పీసీ, ఐపీసీలలో సవరణలు చేయాల్సి ఉంటుంది. భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు సీఆర్‌పీసీ (సవరణ) బిల్లును అప్పటి యూపీఏ ప్రభుత్వం రూపొందించింది. ఈ ప్రతిపాదనకు మెజారిటీ రాష్ట్రాలు ఆమోదం తెలపడంతో గతేడాది డిసెంబరులో ఎలక్షన్ కమిషనర్ నజీమ్ జైదీ హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాస్తూ సవరణ బిల్లు ఆమోదానికి సంబంధించిన ప్రక్రియను వెంటనే చేపట్టాలని అందులో కోరారు.

More Telugu News