: ఈ దోమలతో ‘డెంగ్యూ’కు చెక్ పెట్టొచ్చు!

డెంగ్యూ వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే ఎడెస్ అజీప్తి అనే దోమలను అదుపు చేసేందుకు లుట్జియా ఫుస్కానా అనే దోమలను వ్యాప్తి చేయాలని చూస్తున్నట్లు కోల్ కతా యూనివర్శిటీ పరిశోధకులు తెలిపారు. ఈ మేరకు చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందని పేర్కొన్నారు. ప్రస్తుతం లార్వా స్థాయిలో ఉన్న లుట్జియా ఫుస్కానా అనే దోమను మున్సిపాలిటీ సిబ్బంది ద్వారా కాలువలు, చెత్తా చెదారాలు ఉన్న ప్రాంతాల్లో వదిలిపెడితే కనుక డెంగ్యూ దోమలు అంతమవుతాయని తమ పరిశోధనలో తేలిందన్నారు.

ఒక లుట్జియా ఫుస్కానా దోమ రోజుకు కనీసం పందొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఎడెస్ అజీప్తి లార్వాలను తింటాయని తెలిపారు. పువ్వులు, ఆకులపై ఉండే రసాన్ని మాత్రమే లుట్జియా ఫుస్కానా దోమ ఆహారంగా తీసుకుంటుందని, ఈ దోమలను శాస్త్రీయంగా పెంచేందుకు మస్కిటో కేజ్ ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, ఆ తర్వాత వాటిని మురుగు కాలువలు, చెత్తా చెదారాలు ఉన్న ప్రాంతాల్లో విడిచిపెడతామని పేర్కొన్నారు. అమెరికా, జపాన్ వంటి దేశాల్లో కూడా ఈ తరహా ప్రయోగం జరిగిందని, ఈ పద్ధతిలోనే డెంగ్యూ వ్యాధిని అదుపు చేస్తున్నారని ప్రొఫెసర్ గౌతమ్ ఆదిత్య వెల్లడించారు.
 

More Telugu News