: హైద‌రాబాద్‌లో రేపటి ర్యాలీ నేపథ్యంలో అదనపు బలగాలను తీసుకొస్తున్నాం.. పాల్గొంటే చర్యలే: పోలీసుల హెచ్చరిక

రేపు హైద‌రాబాద్‌లోని సుంద‌ర‌య్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వ‌ర‌కు నిరుద్యోగుల నిరసన ర్యాలీని శాంతియుత‌ నిర్వ‌హిస్తామ‌ని టీజేఏసీ ఛైర్మ‌న్ కోదండ‌రాం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ ర్యాలీపై సెంట్రల్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల‌కు హెచ్చ‌రిక‌లు చేశారు. నిరుద్యోగ ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని, అందులో ఎవరూ పాల్గొనవద్దని సూచించారు. ఒకవేళ పాల్గొంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని నిరుద్యోగులు, విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు.

ఇందిరా పార్కు వద్దకు ఎవరినీ రావద్దని జోయల్ డేవిస్ హెచ్చ‌రించారు. ఈ విష‌యంపై జిల్లాల ఎస్పీలు, నగరంలోని అందరు కమిషనర్లకు కోర్టు ఆదేశాల గురించి చెప్పామని ఆయ‌న అన్నారు. జిల్లాల నుంచి కూడా అదనపు బలగాలను తీసుకొస్తున్నామని ఆయ‌న తెలిపారు. ర్యాలీ నేప‌థ్యంలో అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఆయ‌న చెప్పారు. రేప‌టి ర్యాలీలో నలుగురైదుగురు అసాంఘిక శక్తులు చొరబడినా ప్ర‌మాదం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

More Telugu News