: కేసీఆర్ నమ్మకాల వల్ల ప్రజలపై కోట్ల భారం: జాతీయ మీడియాలో కథనం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సాయంత్రం తిరుమలకు బయల్దేరుతున్నారు. తన కుటుంబ సభ్యులు, కొందరు మంత్రులు, అధికారులతో కలసి ఆయన తిరుమల వెళుతున్నారు. రేపు ఉదయం తిరుమల వెంకన్నను దర్శించుకుని ఆయనకు మొక్కులు చెల్లించుకోనున్నారు కేసీఆర్. ఆయన పర్యటన కోసం టీటీడీ కూడా భారీ ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో, ఓ జాతీయ మీడియా కేసీఆర్ గురించి ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.

తిరుమల వెంకన్నకు ఆయన చెల్లించుకోనున్న మొక్కుల వల్ల సామాన్యులపై రూ. 5.6 కోట్ల భారం పడుతుందని కథనంలో పేర్కొంది. తెలంగాణ ఏర్పాటు కోసం ఆయన మొక్కుకున్న మొక్కుల భారం ఇదని తెలిపింది. వెంకన్నకు స్వర్ణాభరణాలను, పద్మావతి అమ్మవారికి ముక్కుపుడకను ఆయన సమర్పించనున్నారని చెప్పింది. అంతేకాదు తమ తిరుమల ప్రయాణం కోసం కుటుంబ సభ్యులు, మంత్రులతో కలసి ప్రత్యేక విమానంలో వెళుతున్నారని తెలిపింది.

మత సంబంధమైన నమ్మకాలతో కేసీఆర్ ప్రజా ధనాన్ని ఉపయోగించడం ఇదే ప్రథమం కాదని సదరు జాతీయ మీడియా సంస్థ తెలిపింది. వరంగల్ వద్ద ఉన్న భద్రకాళి అమ్మవారికి రూ. 3 కోట్లతో 11 కేజీల బంగారు కిరీటాన్ని సమర్పించారని వెల్లడించింది.  మతపరమైన నమ్మకాలతో కేసీఆర్ కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్న విషయాన్ని తాము 2015 డిసెంబర్ లోనే రాశామని చెప్పింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేని సమయంలో ఈ ఖర్చులేంటని తాము ప్రశ్నించామని గుర్తు చేసింది. అయితే, తనకు చెందిన కొంత సొమ్ముతో పాటు ఇతరుల విరాళాలు కూడా ఇందులో ఉన్నాయని కేసీఆర్ చెప్పినట్లు తెలిపింది.

ఇటీవలే కేసీఆర్ అత్యంత విలాసవంతమైన కొత్త భవంతిలోకి తన నివాసాన్ని మార్చారని తన కథనంలో పేర్కొంది. హైదరాబాద్ నడిబొడ్డున 9 ఎకరాల స్థలంలో ఈ భవంతిని నిర్మించారని... దీని నిర్మాణానికి రూ. 35 కోట్లు ఖర్చు అవుతుందని తొలుత చెప్పినప్పటికీ... ఫైనల్ బిల్ మాత్రం రూ. 50 కోట్లు వచ్చిందని విమర్శించింది. కేసీఆర్ తన వ్యక్తిగత విలాసాలు, మతపరమైన కార్యక్రమాలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరును ప్రతిపక్షాలు తప్పుబడుతున్నప్పటికీ... ఆయన ఏ మాత్రం పట్టించుకోవడం లేదని తెలిపింది.

More Telugu News