: మద్రాసు హైకోర్టులో తమిళనాడు అసెంబ్లీ బలపరీక్ష కేసు విచారణ నేడు

ఈనెల 18న తమిళనాడు శాసనసభలో స్పీకర్ ధన్ పాల్ నిర్వహించిన బలపరీక్ష చెల్లదంటూ ప్రధాన ప్రతిపక్షం డీఎంకే మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు రానుంది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం లేకుండా నిర్వహించిన విశ్వాస పరీక్ష చెల్లదని పేర్కొంటూ, డీఎంకే మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ విశ్వాసపరీక్ష చెల్లదంటూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌ లో న్యాయస్థానాన్ని కోరింది. ఓటింగ్ కంటే ముందు ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే సభ్యులను బలవంతంగా మార్షల్స్ చేత గెంటివేయించారని న్యాయస్థానం దృష్టికి డీఎంకే తెచ్చింది.

తామంతా రహస్య ఓటింగ్ జరపాలని కోరినా పట్టించుకోలేదని చెబుతూ, ఈ వ్యాజ్యాన్ని అత్యవసర విచారణకు స్వీకరించాలని డీఎంకే తరఫున న్యాయవాది మద్రాసు హైకోర్టును కోరారు. ఈ నేపథ్యంలో జస్టిస్‌ జి.రమేష్‌, జస్టిస్‌ మహదేవన్‌ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారణకు స్వీకరించింది. కాగా, శాసనసభలో చోటుచేసుకున్న ఘటనపై శాసనసభ కార్యదర్శి సోమవారం గవర్నరు విద్యాసాగరరావుకు పూర్తి నివేదిక అందజేశారు. 

More Telugu News