: ఆ విషయంలో చిన్నమ్మ నిర్ణయానికి కట్టుబడి వుంటాం!: తంబిదురై

పన్నీర్ సెల్వంపై ఎప్పుడో నిషేధం విధించామని, ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకుంటారా? లేదా? అనే విషయంపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నిర్ణయం తీసుకుంటారని, ఆమె నిర్ణయానికి తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబి దురై అన్నారు. దక్షిణాసియా స్పీకర్స్ సమిట్ లో పాల్గొన్న ఆయన పలు విషయాలను ప్రస్తావించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పన్నీర్ సెల్వం వెంట పది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని అన్నారు. అన్నాడీఎంకేలో ఎటువంటి చీలికలు లేవని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.

సీఎం పళనిస్వామి అసెంబ్లీలో బల పరీక్ష సమయంలో డీఎంకే కార్యకర్తలు పన్నీర్ తో కలిసి వ్యూహాత్మకగా అసెంబ్లీలో గొడవకు దిగారని ఆరోపించారు. తమిళనాడులో రాష్ట్రపతి పాలన రావాలని డీఎంకే నేతలకు ఉందని, అందుకే, ఆ రోజున ఆ విధంగా ప్రవర్తించారని అన్నారు. డీఎంకే నేత స్టాలిన్ కావాలనే తన చొక్కా చింపుకుని, తమ ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేశారన్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ సారథ్యంలో నాలుగున్నరేళ్లు పని చేసి అభివృద్ధి సాధిస్తామని ఆయన అన్నారు. తమిళనాడు రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమైందని, ‘అమ్మ’ జయలలిత ఆశయాలు శశికళ నేతృత్వంలో నెరవేరతాయని అన్నారు. తమిళనాడులో ప్రభుత్వం ఇప్పుడు స్థిరంగా ఉందని, జయలలిత ప్రారంభించిన పథకాలను కచ్చితంగా కొనసాగిస్తామని చెప్పారు.

More Telugu News