: సినిమాలకు పైరసీ ఎలాంటిదో.. చేనేతకు పవర్ లూమ్ అలాంటిది!: పవన్ కల్యాణ్

ఎవరైనా వ్యక్తులు సత్యాగ్రహ దీక్ష చేశారంటే దాని అర్థం, వారు నిజం తాలూకు కోపాన్ని వ్యక్తం చేశారని పవన్ కల్యాణ్ చెప్పారు. చేనేత కార్మికులను గౌరవించడం అంటే వస్త్రాలను గౌరవించడం కాదని, దేశ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడమని ఆయన చెప్పారు. తనతో పాటు స్కూల్ లో చదువుకున్న చేతన కార్మికుల పిల్లలు (తన స్నేహితులు) పస్తులుండడం తనకు తెలుసని ఆయన చెప్పారు. తాను పలు సంస్ధలు, వస్తువులకు కమర్షియల్ బ్రాండింగ్ చేస్తే కోట్ల రూపాయలు తన అకౌంట్ లోకి వస్తాయని అన్నారు. కానీ తనకు కోట్లు అక్కర్లేదని, అందులో ఆనందం లేదని ఆయన పేర్కొన్నారు. చేతి వృత్తులపై ఆధారపడిన మన సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే చేనేతను ప్రోత్సహించాలని ఆయన చెప్పారు.

అందుకే తాను చేనేత బ్రాండింగ్ కు స్వచ్ఛందంగా అంగీకరించానని అన్నారు. చేనేతకు బ్రాండింగ్ చేస్తాననగానే... నిధులిచ్చేవారిని వదిలేసి, విస్తరాకులు ఏరుకునే వాడిదగ్గరకు వెళ్తున్నారని కొందరు నేతలు విమర్శించారని ఆయన గుర్తు చేశారు. తనను విస్తరాకులేరుకునేవాడని కించపరిస్తే బాధపడనని ఆయన చెప్పారు. అలాంటి వ్యక్తులు లేకుండా సమాజం శుభ్రంగా ఉండదని తనను విమర్శించిన వారు గుర్తించాలని ఆయన సూచించారు. ఒక వ్యక్తి చేసే పనికి గౌరవమివ్వకుండా రాజకీయ నాయకులు మాట్లాడితే... వారు కొన్ని పనులు, కొన్ని వర్గాలను కించపరిచేవారవుతారని ఆయన హితవు పలికారు. సమాజాన్ని సంరక్షిస్తామని చెప్పే మీరే (రాజకీయనాయకులే) ఇతరులను అగౌరవపరిస్తే, బడుగు బలహీనులకు ఎలా గౌరవం కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు. సినిమాలకు పైరసీ ఉన్నట్టే చేనేతలకు పవర్ ల్యూమ్ పరిశ్రమ ఉందని ఆయన అన్నారు.

పవర్ ల్యూమ్ పేరుతో చట్టాలను ఖూనీ చేస్తుంటే ప్రభుత్వాలు ఎందుకు మౌనం వహిస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చేనేతకు అండగా ఉంటామని చెప్పాయని, అయితే ఇల్లు అలకగానే పండగ కాదని ఆయన గుర్తు చేశారు. హామీ ఇవ్వగానే పని పూర్తికాదని, దానిని పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. రాజకీయ నాయకులిచ్చిన హామీలపై మోనెటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఈ సంఘాలు నిష్పాక్షికంగా ప్రభుత్వాలు తమకు ఏం చేశాయో చెప్పాలని సూచించారు. చీర నేయడానికి పడే కష్టాన్ని తాను ఇప్పుడే చూశానని, అద్భుతమైన ప్రతిభ దాగి ఉన్న చేనేతను ప్రోత్సహించాలని ఆయన చెప్పారు. ఈ మేరకు నగదు బహుమతులు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

More Telugu News