: సోషల్ మీడియాలో కేసీఆర్ పై వ్యతిరేక పోస్టులు పెడితే ఇక జైలుకే!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోషల్ మీడియాపై దృష్టిసారించారు. ఎందుకంటే, సోషల్ మీడియాలో కేసీఆర్ పైన, తెలంగాణ ప్రభుత్వంపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిపై పార్టీ వర్గాల్లో కలకలం రేగింది. సోషల్ మీడియాలో విద్యావంతులు, యువత చురుగ్గా ఉండడంతో పలు విమర్శలతో కూడిన వినూత్న అంశాలు చర్చకు వస్తున్నాయి.

ఇవి ప్రభుత్వానికి ఇబ్బందిగా పరిణమిస్తున్నాయి. దీనికితోడు ఇవి వైరల్ అవుతున్నాయి. దీంతో సీఎం కేసీఆర్‌ ను కాని, ప్రభుత్వాన్ని కాని దూషిస్తూ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టినా కటకటాల వెనక్కి వెళ్లాల్సిందేనని సైబర్ క్రైమ్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ మేరకు నిబంధనలను సైబర్ క్రైమ్ పోలీసులు సిద్దం చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత పేరుతో ప్రతిపక్షాలు, మరి కొంత మంది కలసి సోషల్‌ మీడియాలో అభ్యంతరకరంగా పోస్టులు అప్‌ లోడ్ చేస్తున్నారని, ఈ పోస్టులపై ఎప్పటికప్పుడు ప్రత్యేక పోలీసుల నిఘా కొనసాగుతుందని వారు వెల్లడించారు. ఇలాంటి పోస్టింగ్స్ ఆరోగ్యకరం కాదని, ఏదైనా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా సాధించుకోవాలని వారు హితవు పలుకుతున్నారు. ఇలా ఒకరిని కించపరిచే విధంగా పోస్టింగులు పెట్టడం ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 

More Telugu News