: వడ్డీలు కట్టలేకపోతున్నాం.. వేరే దారి చూసుకుంటాం!: ఆర్బీఐకు లేఖ రాసిన ఏపీ ప్రభుత్వం!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి అధిక వడ్డీకి తీసుకున్న తమ అప్పులను మార్పిడి చేసుకునే అవకాశం కల్పించాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. ఈ మేరకు ఆర్బీఐకు ఓ లేఖ రాసింది. అధిక వడ్డీల భారంతో ఏపీ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని, ఆ భారం తగ్గించాలని ఆ లేఖలో విన్నవించుకుంది. ప్రస్తుతం ఏడు శాతం కంటే తక్కువకే రుణాలు లభిస్తున్నందున తాము అధిక వడ్డీకి తీసుకున్న అప్పులను మార్పిడి చేసుకునే అవకాశం కల్పించాలని ఆ లేఖలో కోరింది.

కాగా, అప్పుల నుంచి బయటపడేందుకు ఏపీ సర్కార్ చర్యలు ప్రారంభించింది. ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంతో, అప్పులు చేయాల్సి రావడంతో వడ్డీలు భారంగా మారాయి. గత ఏడాదితో పోలిస్తే వడ్డీ చెల్లింపులు ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో నిర్దేశించుకున్న ఖర్చుల కోసం వివిధ రూపాల్లో రుణాలు తీసుకుంటోంది. ఓపెన్ మార్కెట్, చిన్న మొత్తాల పొదుపు, కేంద్ర ప్రభుత్వం, బాండ్లు, ఎల్ఐసీ, జీఐసీ వంటి సంస్థలు.. ఇలా పలు మార్గాల్లో ఏపీ ప్రభుత్వం రుణాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో రుణ భారం నుంచి బయట పడేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నిస్తోంది.

More Telugu News