: ప్రపంచంలో జీవించి ఉన్నవాళ్లలో తెలుగోడే ‘టాప్’.. అతడిని చూడాలంటే తలపైకెత్తాల్సిందే!

ప్రస్తుతం జీవించి ఉన్నవాళ్లలో ప్రపంచంలోనే అత్యంత పొడగరిగా శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలంలోని బిళ్లాని గ్రామానికి చెందిన ఇజ్జాడ షణ్ముఖరావు(24) రికార్డు సృష్టించాడు. ఆరేళ్ల క్రితం వరకు ఐదున్నర అడుగులే ఉన్న షణ్ముఖరావు ఇటీవల విపరీతంగా పొడవు పెరిగాడు. అతడి ఇద్దరు సోదరుల పొడవు కూడా ఐదున్నర అడుగులే. షణ్ముఖరావు అకస్మాత్తుగా పొడవు పెరగడానికి కారణం పచ్చకామెర్ల వ్యాధి. వ్యాధికి మందులు తీసుకున్న తర్వాతి నుంచి తన పొడవు పెరిగిపోయిందని, ప్రస్తుతం తన పొడవు 8.3 అడుగులని షణ్ముఖరావు తెలిపాడు.

పెరిగిన పొడవుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆవేదన వ్యక్తం చేశాడు. పదో తరగతి వరకు చదువుకున్న ఆయన ఉపాధి పనులకు వెళ్తున్నాడు. ప్రయాణ సమయాల్లో ఇబ్బందులు ఎదురవుతుండడంతో తననెవరూ పనులకు పిలవడం లేదని పేర్కొన్నాడు. తన పాదాలకు సరిపడా చెప్పులు కూడా దొరకడం లేదని తెలిపాడు. రోడ్డుపై నడుస్తుంటే అందరూ తనను వింతగా చూస్తున్నారని, దీంతో బయటకు వెళ్లాలంటే సిగ్గేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు  పిల్లనిచ్చేందుకు  సైతం ఎవరూ ముందుకు రావడం లేదని గోడు వెళ్లబోసుకున్నాడు.

ప్రపంచంలో జీవించి ఉన్నవాళ్లలో టర్కీకి చెందిన సుల్తాన్ కోసెన్(34) అత్యంత పొడగరిగా రికార్డులకెక్కాడు. అతడి పొడవు 8.28 అడుగులు. మృతి చెందిన వారిలో ఈ రికార్డు అమెరికాకు చెందిన రాబర్ట్ పర్షింగ్ పేరుపై ఉంది. అతడి పొడవు 8.11 అడుగులు. ఇప్పుడు 8.3 అడుగులతో సుల్తాన్ కోసెన్ రికార్డును షణ్ముఖరావు అధిగమించాడు. అయితే ఇది అధికారికంగా రికార్డుల్లోకి ఎక్కాల్సి ఉంది.

More Telugu News