: అసెంబ్లీలో అసలేం జరిగిందో నాకు తెలియాలి.. అసెంబ్లీ కార్యదర్శికి గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆదేశం

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా ఈనెల 18న అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై గవర్నర్ విద్యాసాగర్‌రావు దృష్టిసారించారు. ఆ రోజు అసెంబ్లీలో అసలేం జరిగిందో తనకు చెప్పాలంటూ అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్‌ను ఆదేశించారు. వాస్తవాలతో కూడిన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బలపరీక్ష సందర్భంగా సభలో విధ్వంసం జరిగిన సంగతి తెలిసిందే. స్పీకర్ చొక్కా చింపిన డీఎంకే సభ్యులు సభలోని కుర్చీలు, మైకులను ధ్వంసం చేశారు. దీంతో సభను రెండుసార్లు వాయిదా వేసిన స్పీకర్ ఆ తర్వాత డీఎంకే సభ్యులను బయటకు పంపాకే  బలపరీక్ష నిర్వహించారు. సభ నుంచి చినిగిన చొక్కాతో బయటకు వచ్చిన డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ సభలో తనపై దాడి జరిగిందని గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తగిన చర్యలు తీసుకోకుంటే నిరాహార దీక్షకు సైతం దిగుతానని హెచ్చరించారు. అంతేకాదు ఈనెల 22న తమిళనాడు వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, నిరాహార దీక్షలు చేపట్టాలని పార్టీ శ్రేణులను అధిష్ఠానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై గవర్నర్ నివేదిక కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది.

More Telugu News