: ట్రావెల్ బ్యాన్ ఆదేశాల్లో స్వల్ప మార్పులు... కోర్టులు అడ్డుకోకుండా ట్రంప్ ఎత్తు!

అమెరికాలోకి ముస్లింల ప్రవేశాన్ని నిషేధిస్తూ, తానిచ్చిన కార్యనిర్వాహక ఆదేశాలను కోర్టులు అడ్డుకోవడంతో, దిగివచ్చిన ట్రంప్, కాస్తంత మెత్తబడ్డట్టు తెలుస్తోంది. ఈ విషయంలో మరో ఆదేశాలు ఇవ్వాలని, ట్రావెల్ బ్యాన్ నుంచి గ్రీన్ కార్డులున్న వారిని మినహాయిస్తూ, ఆదేశాలు ఇస్తే, దాన్ని కోర్టులు అడ్డుకోబోవని ట్రంప్ భావిస్తున్నట్టు సమాచారం. ట్రావెల్ బ్యాన్ నిబంధనలకు మార్పులు చేర్పులు చేయనున్నట్టు యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ మంత్రి జాన్ కెల్లీ వెల్లడించారు.

మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, తొలుత ఇచ్చిన ఆదేశాలతో పోలిస్తే, తాజా ఆదేశాలు కొంత సరళీకృతంగా ఉంటాయని, ఏది ఏమైనా అమెరికాను, ఇక్కడి ప్రజలను మరింత సురక్షితంగా చేయడమే ఆయన ఉద్దేశమని అన్నారు. సరైన అనుమతులు లేనివారిని అమెరికా గడ్డపై కాలు మోపనీయబోమని ఆయన స్పష్టం చేశారు. కాగా, ట్రంప్ తన తొలి ఆదేశాల్లో 7 ముస్లిం దేశాల పౌరులపై నిషేధం విధించగా, కోర్టులు దాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే.

More Telugu News