: తమిళనాడు అసెంబ్లీ తీరుపై మండిపడ్డ నటులు కమల్, అరవింద స్వామి, రాధిక, ఖుష్బూ

తమిళనాడు అసెంబ్లీలో ఈ రోజు చోటు చేసుకున్న ప‌రిణామాలపై సినీన‌టులు కమల్‌ హాసన్‌, రాధిక, ఖుష్బూ, అరవింద స్వామితో పాటు ప‌లువురు ట్విట్ట‌ర్ ద్వారా త‌మ స్పంద‌న తెలిపారు. రాష్ట్రానికి మరో కొత్త సీఎం వచ్చినట్టే కనిపిస్తోందని,  జై డె'మాక్‌'క్రేజీ అంటూ ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని కమల్‌ హాసన్ పేర్కొన్నారు. గౌరవనీయులైన ఎమ్మెల్యేలకు ప్రజలు సరైన రీతిలో స్వాగతం పలుకుతారని ఆయ‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
ప్రజాస్వామ్యానికి ప్రతిపక్షమే బలం, ప్రతిపక్ష సభ్యులు లేకుండా బలపరీక్ష నిర్వహించడమేట‌ని ఖుష్బూ అన్నారు. ప్రజాస్వామ్యానికి ఇది విరుద్ధమేనని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. రాష్ట్రంలోని పరిణామాలు అవమానకరంగా ఉన్నాయని, గవర్నర్ వెంట‌నే రంగంలోకి దిగి చర్య తీసుకోవాలని రాధిక పేర్కొన్నారు. నటుడు అరవింద స్వామి స్పందిస్తూ...  ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వని ఎమ్మెల్యేలతో ఈ బలపరీక్షను నిర్వ‌హించార‌ని, దాన్ని ఎవరూ అంగీకరించబోరని అన్నారు.

ఎమ్మెల్యేలు కలవాల్సింది త‌మ ప్రాంత‌ ప్రజలను కానీ, రిసార్టులో పార్టీ నేతలను కాదని ఆయ‌న పేర్కొన్నాడు. అసెంబ్లీ సమావేశాల దృశ్యాలు ప్ర‌సారం చేయ‌కుండా, ఎంచుకున్న దృశ్యాలను మాత్రమే విడుదల చేయడం సిగ్గుచేటని ఆయ‌న మండిప‌డ్డారు. త‌మిళ‌నాడు అసెంబ్లీలో జ‌రిగిన ప‌రిణామాల‌పై మ‌రికొంత మంది సినీన‌టులు కూడా భిన్న అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు.

More Telugu News