: ఇది శశికళ విజయం...వ్యూహాన్ని పక్కాగా అమలు చేసింది!

తమిళనాట ఒకరికి ఖేదం, మరొకరికి మోదం. గత 14 రోజులుగా చోటుచేసుకున్న పరిణామాల తరువాత ఎన్నో అంచనాలు, మరెన్నో ఊహాగానాలు. ఇంకెన్నో ట్విస్టులతో తమిళనాడు రాజకీయాలు ఎన్నో మలుపులు తిరిగాయి. పన్నీరు సెల్వం ఎదురు తిరగడంతో తమిళనాట హైడ్రామా చోటుచేసుకుంది. అన్నా డీఎంకే రెండుగా చీలిపోతుందని అంతా భావించారు. మచ్చలేని పన్నీరు సెల్వానికి సహచరుల నుంచి మద్దతు లభిస్తుందని, శశికళను ఎవరూ అంగీకరించడం లేదని రాజకీయ పరిశీలకులు భావించారు. అయితే జయలలిత మరణం అనంతరం మన్నార్ గుడి మాఫియా అండతో శశికళ అత్యంత సులభంగా వ్యూహాలు అమలు చేసింది. ఎమ్మెల్యేలను గోల్డెన్ బే రిసార్టుకు తరలించడం ద్వారా తనపై తీవ్రమైన వ్యతిరేకత రాకుండా చూసుకుంది. వారు చేజారకుండా తాయిలాలు ఎరవేసి, రిసార్టులో స్వర్గసుఖాలు రుచిచూపి వారు దూరం కాకుండా చూసుకుందంటూ వార్తలొచ్చాయి.

ఒక్కసారి అధికారం పోతే మళ్లీ రాదని అనుయాయులను ఆమె హెచ్చరించింది. అధికారం గుప్పిట్లో ఉండాలన్నా, ఏం చేయాలన్నా కలిసికట్టుగా ఉంటేనే సాధ్యమని హితబోధ చేసింది. అనంతరం న్యాయస్థానం విధించిన శిక్షను అనుభవించడానికి చెరసాలకు పయనమైన శశికళ...తన అనుచరుడ్ని ప్రకటించి, అతనేం చేయాలో, ఏం చేయకూడదో వివరించి, ప్రతిక్షణం తన మనసు తమిళనాడులోనే ఉంటుందని హెచ్చరించి మరీ జైలుకెళ్లిపోయింది. తన చిరకాల వాంఛ అయిన సీఎం కాలేకపోయినా, తమిళనాట అధికారాన్ని మాత్రం తన గుప్పిట్లో బంధించింది. ఇప్పుడు ఆమె ముందున్న లక్ష్యం ఒక్కటే, బెంగళూరు నుంచి తమిళనాడు జైలుకు ట్రాన్స్ ఫర్ పెట్టించుకోవడం. జైలు నుంచే రాష్ట్రాన్ని పాలించడం. ఏమైనా, ఇది అన్నా డీఎంకే విజయం అనే కంటే శశికళ విజయం అనడమే సముచితం!

More Telugu News