: అదే జరిగితే పళనిస్వామి పదవి గోవిందా!.. ఈపీఎస్ వర్గంలో టెన్షన్.. టెన్షన్!

అయిపోయింది.. తమిళనాడు సంక్షోభం ముగిసిపోయింది.. అనుకున్న తరుణంలో మరోమారు టెన్షన్ మొదలైంది. మూడు దశాబ్దాల తర్వాత తమిళనాడులో జరుగుతున్న తొలి విశ్వాస పరీక్ష పళని వర్గంలో టెన్షన్ రాజేసింది. క్షణక్షణానికి మారుతున్న పరిణామాలతో ఎప్పుడు ఎవరు ఎటువైపు ఉంటారో తెలియక అటు పళని, ఇటు పన్నీర్ వర్గంలో ఉత్కంఠ నెలకొంది. మెజారిటీపై పళనిస్వామి ధీమాగా ఉన్నా ఏడుగురు ఎమ్మెల్యేలు గోడ దూకితే పళనిస్వామి ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు వదులు కోవాల్సి వస్తుంది.

ఆయన వర్గంలోని 40 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారన్న వార్తలు ఈపీఎస్‌ను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అసంతృప్తి ఎమ్మెల్యేలు ఈపీఎస్‌ (పళనిస్వామి)కు వ్యతిరేకంగా ఓటేస్తే తనకు లైన్ క్లియర్ అవుతుందని ఓపీఎస్ (పన్నీర్ సెల్వం) భావిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేల్లో ఎవరు ఎటువైపు ఉన్నారో తెలియక ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు తలలు బద్దలుగొట్టుకుంటున్నాయి. బలనిరూపణ వరకు ఎవరూ గోడ దూకకుండా కాపాడుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కాగా ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ డీఎంకే నేత స్టాలిన్ తమ పార్టీ శాసనసభ్యులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బలపరీక్షపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

More Telugu News