: 'రియల్' ఫ్రూట్ జ్యూస్ కు ఊహించని షాకిచ్చిన తొమ్మిదేళ్ల బాలిక!

అస్సాంలోని ప్రధాన పట్టణం గౌహతికి చెందిన మృంగా కే మజుందార్‌ (9) 'రియల్' ఫ్రూట్ జ్యూస్ సంస్థకు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ మధ్యే తన తండ్రితో పాటు ఆ చిన్నారి షాపింగ్ కు వెళ్లింది. ఆ షాపులో ఫ్రూట్ జ్యూస్ తాగుతానని మారాం చేసింది. దీంతో కుమార్తెకు ఆ తండ్రి 'రియల్ బ్రాండ్ ఫ్రూట్ జ్యూస్ కొనిచ్చాడు. అయితే, ఆ ఫ్రూట్‌ జ్యూస్‌ ప్యాకేజింగ్‌ పై ఓ బాలుడు స్కూల్‌ యూనిఫాం వేసుకుని ఉండటంతో అది కేవలం అబ్బాయిలు తాగేందుకేనా? అని తండ్రిని ప్రశ్నించింది. కాదని తండ్రి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, దానిని తాగేందుకు మృంగా నిరాకరించింది.

కుమార్తె ఆలోచనలో, ఆవేదనలో అర్ధముందని భావించిన మృంగా తండ్రి వెంటనే కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీకి లేఖ రాశారు. రియల్‌ ఫ్రూట్‌ జ్యూస్‌ ప్యాకేజింగ్‌ పై మహిళల పట్ల వివక్ష చూపే విధంగా ఫోటో ఉందని పేర్కొన్నారు. తన కుమార్తెకు, తనకు మధ్య జరిగిన సంభాషణ, తన కుమార్తె తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఆయన ఆ లేఖలో వివరించారు. దీంతో మంత్రి రియల్ ఫ్రూట్ జ్యూస్ సంస్థను వివరణ కోరింది. దీంతో, మహిళలపట్ల తమకెలాంటి వివక్ష లేదని, ఆ ఫోటోను వెంటనే తొలగిస్తున్నామని ప్రకటించింది. భవిష్యత్ లో ఇలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్త పడతామని సంస్థ ప్రకటించింది. 

More Telugu News