: ఆర్కే నగర్ కు మారిన తమిళ రాజకీయం... దీప వర్సెస్ దినకరన్?

తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని భావించిన శశికళకు సుప్రీంకోర్టు తీర్పు శరాఘాతంగా మారింది. మరో పదేళ్ల వరకు కనీసం ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తన అక్క కుమారుడు దినకరన్ ను జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దించాలని శశి భావిస్తున్నారు. వాస్తవానికి పళనిస్వామి కేబినెట్ లో దినకరన్ కు మంత్రి పదవి ఇవ్వాలని శశి తొలుత భావించారు. అయితే, కనీసం ఎమ్మెల్యే కూడా కాని వ్యక్తికి మంత్రి పదవిని కట్టబెడితే ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళతాయనే యోచనతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఈ నేపథ్యంలో దినకరన్ ను ఆర్కే నగర్ ఉపఎన్నికల బరిలోకి దింపనున్నారు. ఆ తర్వాత అతనికి కీలకమైన మంత్రి పదవిని కట్టబెట్టాలని మన్నార్ గుడి టీమ్ భావిస్తోంది. అయితే, శశికళ కుటుంబంపై కొంతమేర వ్యతిరేకత కలిగిన ఆర్కే నగర్ ఓటర్లు... దినకరన్ కు ఎంత మేర సపోర్ట్ చేస్తారనే అనుమానాలు కూడా ఉన్నాయి.

మరోవైపు, శశికళను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పన్నీర్ సెల్వం ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో జయలలిత మేనకోడలు దీపను బరిలోకి దించాలని భావిస్తున్నారు. దీప పట్ల ప్రజల్లో మంచి స్పందన ఉండటం, తమకు లాభిస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే, తమిళ రాజకీయాలు ఆర్కే నగర్ కు మారడం ఖాయంగా కనిపిస్తోంది. దినకరన్, దీపలు ఉపఎన్నికలో ముఖాముఖి తలపడితే, అక్కడి రాజకీయం మరింత వేడక్కడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే, ఆరు నెలల్లోగా ఉపఎన్నిక నిర్వహించాలి. జయ చనిపోయి ఇప్పటికే రెండు నెలలు ముగియడంతో, మరో నాలుగు నెలల్లోగా ఆర్కే నగర్ నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. 

More Telugu News