: అనుకోని అతిథి ఆరుగంటలు ఊరుమొత్తం కలియతిరిగింది...బెంబేలెత్తి ఇళ్లపైకి చేరిన గ్రామస్థులు

హర్యాణాలోని పల్వాల్ గ్రామంలోకి అనుకోని అతిథి వచ్చింది. ఊరు మొత్తం చుట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే... గ్రామంలోని కృష్ణకాలనీలోని పార్కులో చిరుతపులి ఉండడాన్ని ఉదయం ఏడు గంటల సమయంలో వ్యాహ్యాళికి వెళ్లినవారు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన వారు గ్రామంలోకి వచ్చి అటుగా ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించి, అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు.

కాసేపటికే ఆ చిరుతపులి గ్రామంలో ప్రవేశించింది. దీంతో గ్రామంలోని పిల్లాపెద్ద అంతా మేడలపైకి ఎక్కేసి దానిని గమనించసాగారు. ఇంతలో అది గ్రామం మొత్తం కలియతిరిగింది. ఎక్కడా ఏమీ దొరకకపోవడంతో మళ్లీ పార్కులోకి వచ్చేసింది. దీంతో అక్కడ మాటువేసిన అటవీశాఖాధికారులు, దానికి మత్తుమందునిచ్చి పట్టుకున్నారు. దానిని పట్టుకునే సందర్భంగా భారీ సంఖ్యలో గ్రామస్తులు గుమికూడడం విశేషం. 

కాగా, మూడు నెలల క్రితం అలాగే గ్రామంలో దూరిన చిరుతను అటవీశాఖాధికారులు బంధించే ప్రయత్నం విఫలం కాగా, గ్రామస్థులు ముందుకురికి దానిని హతమార్చారు. ఈసారి అలాంటి ప్రమాదం లేకుండా అటవీశాఖాధికారులు దానిని బంధించారు. ఆరు నెలలు దానిని పరిశీలించిన పిదప దానిని అభయారణ్యంలో విడిచిపెడతామని వెల్లడించారు. 

More Telugu News